ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య.. మన బతుకుదెరువు ముచ్చట.. అందుకే ఆలోచించి ఓటేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ నియోజకవర్గం అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి, కల్వకుర్తి నియోజకవర్గం అభ్యర్థి జైపాల్యాదవ్లకు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రసంగించారు. నాడు కాంగ్రెస్ రాజ్యంలో ఆపద్బాంధు పథకం కింద రూ.50 వేలు ఇస్తామని చెప్పి.. తాకట్లు, కేసులు పెట్టి, ఆరేడు నెలలు ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిప్పుకొని, లంచాలు గుంజి రూ.10 వేలు కూడా చేతుల పెట్టలే..
అలాంటి కాంగ్రెస్ రాజ్యం ఎవరైనా కోరుకుంటారా.? ప్రాజెక్టులు కట్టడం చేతకాక.. మన ప్రాజెక్టులకు పెండింగ్ ప్రాజెక్టులని పేరు పెట్టారు. మీది బ్యాక్వర్డ్ ఏరియా.. వడ్లు పండయ్.. పంటలు పండియ్యరాదు.. తెలివి లేదు.. వెనుకపడ్డరని ఆ సన్నాసులు మాట్లాడిన్రు. మరి 30 ఏండ్లు పండవెట్టిన కల్వకుర్తి స్కీమ్ ఇవాళ ఎలా తయారై నీళ్లు వస్తున్నయ్..? ఏ డాంబర్ రోడ్డు మీద చూసినా వడ్ల కుప్పలే ఎండపోసి ఉన్నయ్. ఎక్కడ చూసినా ధాన్యపు రాశులే కనిపిస్తున్నయ్. ఎట్ల పండినయ్..? మళ్లీ కాంగ్రెస్ను నమ్ముకుంటే.. నాటి కరువు వస్తది.. జాగ్రత్త.
ఆనాడు ప్రాజెక్టును ఎండవెట్టి మనలను అరిగోసపుచ్చుకున్నరు. ఇవాళ మంచిగ నడిచే తెలంగాణను మీరే కాపాడుకోవాలి. ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలి.. చిన్నాన్న చెప్పిండు.. బామ్మర్ది చెప్పిండని ఓటేస్తే.. ధరణి పోతది.. కరెంటు కాటగలుస్తది.. రైతు బంధుకు రాంరాం.. చెప్తరు. దళారుల రాజ్యం వస్తది.. దోచుకుతింటరు. అందుకే చెప్తున్న.. అభివృద్ధి పథంలో నడిపిస్తున్న బీఆర్ఎస్కే ఓటువేయాలి.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.