పదేండ్లు నానా కష్టాలుపడి పేదలు, రైతులను కాపాడి తెలంగాణను ఓ దరికి తీసుకువస్తే.. నాశనం చేసేందుకు మళ్లీ ఢిల్లీ గద్దలన్నీ వాలుతున్నయ్.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం అలంపూర్ నియోజకవర్గం అభ్యర్థి వెంకట్రామ్రెడ్డి, కొల్లాపూర్ నియోజకవర్గం అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డిలకు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ నాయకులు సిగ్గులేకుండా మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెబుతున్నరు.. 50 ఏండ్లు ఏముండే మనం చూడలేదా.? తెలంగాణను ఆగం పట్టించి బతుకులను నాశనం చేసిండ్రు.
ఆనాడు కాంగ్రెస్ పాలనలో జరిగిన అన్యాయాలన్నీ పదేండ్లుగా తండ్లాడి ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ రాష్ర్టాన్ని ఒక తొవ్వకు తెచ్చాం. రైతుబంధు అని ఎప్పుడన్నా కలలోనైనా విన్నమా..? కాంగ్రెస్ పాలనలో బ్యాంకు అప్పులు కట్టకుంటే తలుపులు పీక్కపోయిన్రు కానీ.. రూపాయి ఇచ్చారా.? ఇప్పుడొచ్చి 24 గంటల కరెంటు వేస్ట్.. మూడు గంటలే చాలు.. రైతులు పది హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలి చెప్తున్నరు.. తెలంగాణలో ఇవి మార్చాలంటే రూ.30వేల కోట్లు కావాలి.
మరి డబ్బులు ఎవడివ్వాలి..? కాంగ్రెస్ పార్టీ ఇస్తదా..? దీని అర్థం ఏంటీ.? పదేండ్లు తండ్లాడి ఒక తొవ్వకు తెచ్చిన తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తున్నరు. పదేండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను ఇంటింటికి వెళ్లి వివరించాలి. ఆటోమేటిక్గా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచిపోతాం. అని సీఎం కేసీఆర్ అన్నారు.
Hyd7