మొయినాబాద్, మే 19: రాష్ట్ర ప్రభుత్వం జీవో 111 ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడంతో 84 గ్రామాల ప్రజల దశాబ్దాల కల నెరవేరిందని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి అన్నారు. మూడు దశాబ్దాలుగా ఆ జీవో ఆయా గ్రామాల అభివృద్ధికి అడ్డుగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో 111 ఎత్తివేయడంతో శుక్రవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్యలతో కలిసి హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీవో పరిధిలోని ప్రజల ఇబ్బందులను పదే పదే సీఎం కేసీఆర్ దృష్టికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, తాను తీసుకెళ్లిన్నట్లు గుర్తుచేశారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ జీవోను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీకి కట్టుబడి జీవో 111ను పూర్తిగా ఎత్తివేయడం అభినందనీయమన్నారు. హెచ్ఎండీఏ పరిధిలో ఏవైతే విధివిధానాలు అమలు అవుతున్నాయో అవే విధాననాలు జీవో 111 పరిధిలో అమలు అవుతానని చెప్పారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో చేవెళ్ల ప్రాంతం మినీ హైదరాబాద్‌గా అభివృద్ధి చేయడానికి మంచి మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ నివాసంలో..
జీవో 111 ఎత్తివేతపై శుక్రవారం శంషాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు కే చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ నివాసం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, జడ్పీటీసీ నీరటి తన్విరాజు, మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ గోపాల్‌యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ దవాణాకర్గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గణేష్‌గుప్త, కౌన్సిలర్లు అయిల్ కుమార్, చెన్నం ఆశోక్, జాంగీర్‌ఖాన్, సర్పంచ్‌లు దండు ఇస్తారి, రమేశ్ యాదవ్, సతీశ్ యాదవ్, రాంగోపాల్, దేవానాయక్, రైతు విభాగం అధ్యక్షుడు యాదగిరిరెడ్డి, యూత్ అధ్యక్షుడు రాజశేఖర్‌గౌడ్, మోహన్‌నాయక్, రవీందర్‌నాయక్, మాజీ సర్పంచ్‌లు జిట్టె సిద్ధులు, శ్రీనివాస్‌రెడ్డి, సత్యానందం, రామునాయక్, మంచర్ల శ్రీనివాస్, ఎస్సీసెల్ అధ్యక్షుడు శ్రీనివాస్, శివాజీ, గణేశ్ పాల్గొన్నారు.
కుల వృత్తులను సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తూ వారికి వెన్నంటి నిలుస్తున్నారని తెలంగాణ బెంగాలీ సమితి అధ్యక్షుడు, బీఆర్ఎస్ నాయకుడు దిపాంకర్పాల్ అన్నారు. కుల వృత్తులను కొనసాగిస్తున్న వారికి లక్ష రూపాయాలు అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో దిపాంకర్పాల్ హర్షం వ్యక్తంచేస్తూ శుక్రవారం ఘాన్సీబజార్ బీఆర్ఎస్ కార్యలయంలో సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి వీఆర్ఏల క్షీరాభిషేకం
వీఆర్ఏలకు రెగ్యులర్ స్కేల్ ఇచ్చి క్రమ బద్ధీకరించేందుకు ప్రభుత్వం అంగీకరించటంతో మండల వీఆర్ఏలు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు కృష్ణ కుమార్, లక్ష్మయ్య, రాజు, వంశీ, ప్రభాకర్, కృష,్ణ మైసయ్య, సత్యనారాయణ, భిక్షపతి, విజయ లక్ష్మి, కలీం తదితరులు పాల్గొన్నారు.
25 ఏండ్ల బాధను దూరం చేసిన సీఎం కేసీఆర్
ఇన్నాళ్లు సీమాంధ్ర నేతలు చేసిన కుటిల నీతి వల్ల జీవో 111 పరిధిలోని గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో 111 రద్దు చేయడం సంతోషంగా ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సులేమాన్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ ఉపాధ్యాక్షుడు యండీ గౌస్, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. 25 ఏండ్ల బాధ సీఎం కేసీఆర్ నిర్ణయంతో పటాపంచలైందని ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఎవరూ భూములను అమ్ముకోవద్దు
దశాబ్దాల కాలంగా అపరిష్కృతంగా ఉన్న జీవో 111ను తొలగించేందుకు సీఎం కేసీఆర్ రూపంలో పరిష్కారం లభించిందని ఇందుకు నియోజకవర్గ ప్రజల తరఫున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ అన్నారు. గురువారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో జీవో 111ను తొలగిస్తున్నట్లు ఏకపక్ష తీర్మాణం పట్ల శుక్రవారం ఆయన నియోజకవర్గ పరిధిలోని 33 గ్రామాల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదన్నారు. నియోజకవర్గ ప్రజలు రియల్ మాఫియా మాటలకు మోసపోకుండా విక్రయాలు చేయవద్దని సూచించారు. భవిష్యత్తులో ఈ భూముల ధరలకు ఆకాశాన్నంటే పరిస్థితులు వస్తాయన్నారు.