తెలంగాణ ప్రజల కోసం, హక్కుల కోసం పుట్టింది బీఆర్ఎస్. పార్టీకి కులం, మతం, జాతి అనే తేడా లేదు. అందరినీ కలుపుకుపోతున్నాం.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బుధవారం సిర్పూర్ నియోజకవర్గం అభ్యర్థి కోనేరు కోనప్ప, అసిఫాబాద్ నియోజకవర్గం అభ్యర్థి కోవా లక్ష్మికి మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. “బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీకు తెలుసు. అభివృద్ధి మీ కండ్ల ముందుంది. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో నష్టపోయాం.. బాధపడ్డాం. రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు, పరిశ్రమలు మూతపడటం రకరకాల ఇబ్బందులు చూశాం. పొట్ట చేత పట్టుకొని వలసలు పోయారు.
ఈ పదేండ్లలో ఒక్కొక్కటి బాగుచేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇవ్వాళ 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. విద్యా, వైద్య వ్యవస్థను బాగుచేసుకున్నాం. ప్రైవేటు దోపిడీని తగ్గించాం. గురుకుల విద్యాసంస్థలు నెలకొల్పాం. డాక్టర్లు, ఇంజినీర్లను తయారు చేసుకుంటున్నాం. రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నాం, నీటి తీరువా ఎత్తేశాం. బకాయిలు రద్దు చేసుకున్నాం. కనీస మద్దతు ధర ఇస్తూ.. పండిన పంటను ఏ ఊరికి ఆ ఊర్లోనే కొంటున్నాం. ధరణిని తీసుకువచ్చి దళారీ రాజ్యానికి చెక్ పెట్టాం.. మొత్తానికి ఇవాళ రైతుల ముఖాలు తెల్లపడ్డాయి. ఇప్పుడు కాంగ్రెసోళ్లు ధరణిని బంగాళాఖాతంలో వేసి.. దళారీ, పైరవీకారుల రాజ్యం తెస్తరంట. రైతులు ఆగమవుతారు. మీ ఓటు వజ్రాయుధం, భవిష్యత్‌ను నిర్ణయిస్తది. అందుకే ఏ ప్రభుత్వం ఏం చేసిందో లెక్క తీసి.. ఎవరు గెలిస్తే మంచిదో.. నిర్ణయించి ఓటేయాలి. అభివృద్ధి చెందుతున్న తెలంగాణ ఇదే విధంగా
అభివృద్ధి చెందాలి కాబట్టి.. బీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్లీ రావాలి.” అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
సిర్పూర్ గురించి మంచం పట్టిన మన్యం అని వార్తలు వస్తుండే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లంబాడీ, ఆదివాసీ గూడెంలకు భగీరథ నీళ్లు వస్తున్నాయి. కరెంటు బాధ లేదు. నియోజకవర్గంలో 16వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాం. గిరిజనులపై ఉన్న కేసులు ఎత్తేశాం. గిరిజనేతర బిడ్డలకు పట్టాలు వస్తాయి. దానికి ఆటంకం కేంద్ర ప్రభుత్వమే. కఠినమైన రూల్స్ పెట్టారు. లెక్కలు తీసి కేంద్రానికి పంపించాం. ఎన్నికల తర్వాత పోరాటం చేసి గిరిజనేతరులకు కూడా పట్టాలు అందజేస్తాం. కాగజ్‌నగర్ ఒకప్పుడు మినీ ఇండియాలాగ ఉండే. మిగిలిన ఖార్ఖానాలు తెరిపిస్తాం. మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తాం.
అసిఫాబాద్‌లో 47వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాం. వారందరికీ రైతుబంధు ఇస్తున్నాం. రైతు బీమా పెట్టుకున్నాం. ఆదివాసీ, లంబాడీ తండాలకు త్రీ ఫేజ్ కరెంటు సదుపాయం కూడా కల్పిస్తున్నాం. ఇంకా మిగిలి ఉంటే అదికూడా పూర్తవుతుంది. ఆరె కులస్తులను ఓబీసీలో చేర్చే ప్రయత్నం చేస్తాం. మాలి కులస్తుల విషయలో మేం తీర్మానం చేసి పంపించాం. కానీ కేంద్రం పట్టించుకోవడం లేదు. వారి సంక్షేమానికి ప్రత్యేక నిధులు వెచ్చిస్తాం.