హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): “మీ భూముల మీద యాజమాన్యం మీ చేతుల్లో లేకుండే.. పెత్తనం ఆఫీసర్లది ఉండే.. ఇప్పుడే మీ బొటనవేలికి హక్కులు కల్పించినం. మరి ఇంత మంచిగా ఉన్న అధికారాన్ని ఉంచుకుంటారా..?పోడగొట్టుకుంటారా..? ఆలోచన చేయండి” సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం మానకొండూరు నియోజకవర్గం అభ్యర్థి రసమయి బాలకిషన్, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం అభ్యర్థి కడియం శ్రీహరికి మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. 70ఏండ్లలో జరుగని అభివృద్ధిని గత పదేండ్లలో చేసినం. వ్యవసాయ రంగం కుదుటపడ్డది. కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుంది. రైతుల ముఖాలు తెల్లవడ్డాయి. వైద్య రంగం మెరుగుపడ్డది. ఇండ్ల జాగలు లేనోళ్లకు జాగలు ఇప్పిద్దాం.. సొంత జాగ ఉన్నోళ్లకు డబ్బులు ఇద్దాం.
డబుల్ బెడ్రూం ఇండ్లు, గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఒక్కరి సొంతింటి కల నెరవేర్చుదాం. 58 ఏండ్లు మనల్ని అరిగోస పెట్టిన కాంగ్రెసోళ్లు ఇవ్వాల వచ్చి ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్తున్నరు. ఆ రాజ్యంలో ఏం చక్కదనం ఏడ్చింది. ఆకలి చావులు, ఎమర్జెన్సీ, ఎన్కౌంటర్లు, నక్సలైట్ ఉద్యమాలు., జైళ్లలో పెట్టుడు, కరెంటు కోతలు, మంచి నీటికోసం అవస్థలు, ప్రభుత్వాలు కూలగొట్టుడు.. ఆ రాజ్యం బాగలేకనే కదా.. ఎన్టీఆర్ పార్టీ పెట్టి రూ.2లకు కిలో బియ్యం ఇచ్చి పేదల కడుపు నింపిండు. ఇది నిజం కాదా.? ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ.. 58 ఏండ్లు కొట్లాడి బయటపడ్డాం. మళ్లీ అధికారంలోకి రాగానే.. ఆటో కార్మికులకు ఫిట్నెస్ ఛార్జి,సర్టిఫికెట్ ఛార్జీలను రద్దు చేస్తాం. ఆర్టీసీ బిడ్డలను రెగ్యులరైజ్ చేసి గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా చేస్తాం. కాంగ్రెస్ నాయకులకు మాట్లాడటానికి సిగ్గుండాలి. రైతు రుణమాఫీ చేస్తామని రెండుసార్లు చెప్పాం. బాజాప్తా చేసినం. కరోనా రావడం వల్ల ఆదాయం సున్నా కావడంతో కొంత ఆలస్యమైంది. 90 శాతం మాఫీ చేసినం. కాంగ్రెసోడు అడ్డుపడటంతో ఆగింది. ఓట్లు అనగానే ఆగమాగం కాకుండా.. చెప్పుడు మాటలు వినకుండా.. ఆలోచించి ఓటేయాలి. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.