మేడ్చల్, జూలై 17: మంత్రి మల్లారెడ్డి సహకారంతో ఏండ్ల నాటి సమస్యకు పరిష్కారం లభించింది. ఇండ్ల మీది నుంచి వెళ్తున్నవిద్యుత్ వైర్లతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు వారం పది రోజుల్లో పరిష్కారం చూపారు. అధికారులతో మాట్లాడటమే కాదు అందుకు అయ్యే ఖర్చును తాను సొంతంగా భరించి, లైన్ను ఇండ్ల మీది నుంచి మార్చేందుకు చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే…మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలో దాదాపు 50 ఏండ్ల క్రితం విద్యుత్ లైన్ వేశారు. కాలక్రమేణా గ్రామం పెద్దదిగా మారడడంతో ప్రజలు ఇండ్లను నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆ లైన్ గ్రామంలోని 3వ వార్డులో ఉన్న గరీబ్నగర్, వీకర్సెక్షన్ కాలనీలోని దాదాపు 20 ఇండ్ల మీదుగా వెళ్తుంది. ఇది ఆ ఇండ్ల వాసులకు శాపంగా మారింది. ఇండ్ల మీదుగా లైన్ వెళుంతుండడంతో పై అంతస్తు నిర్మించుకోవడానికి ఇబ్బంది మారింది. రజకుల స్థలం మీదుగా వెళ్తుండటంతో సామాజిక భవనాన్ని నిర్మించుకోలేకపోతున్నారు. మరమ్మతుల కోసం ఇండ్లపైకి వెళ్లడం కూడా ఇబ్బందిగా మారింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ సమస్యను ప్రజలు ఎన్నో ఏండ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.
హైటెన్షన్ విద్యుత్ వైరుతో గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఆయన విద్యుత్ అధికారులతో మాట్లాడారు. ఇండ్ల మీది నుంచి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా రోడ్డు మీదికి మార్చాలని సూచించారు. ఇందుకు అయ్యే ఖర్చు ఎంత అవుతుందో ప్రతిపాదనలు రూపొందించి, పంపాలని తానే భరిస్తానని ఆదేశించారు. ఇచ్చిన మాటా ప్రకారం రూ.15 లక్షలు లైన్ మార్చేందుకు సొంత డబ్బులను చెల్లించారు. అధికారులు పనులు ప్రారంభించి, పూర్తి చేశారు. ఎన్నో ఏండ్లకు సమస్యకు పరిష్కారం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి చామకూర మల్లారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సొంత ఖర్చులతో సమస్యను పరిష్కరించిన ఆయన సల్లంగా ఉండాలని దీవిస్తున్నారు.
మల్లారెడ్డి సార్కు రుణపడి ఉంటాం..
మంత్రి మల్లారెడ్డి సార్కు రుణపడి ఉంటాం. కరెంట్ తీగలు ఇండ్లపై నుంచి వెళ్తుండటంతో చాలా ఇబ్బంది పడ్డాం. ఎంతో మందిని కలిసి మా ఇబ్బంది చెప్పుకున్నాం. అయి నా ఎవరూ ఏమి పట్టించుకో లేదు. మల్లారెడ్డి సార్ మాత్రం మా బాధలను గుర్తించిండు. వెంటనే కరెంట్ లైన్ను మార్చేసిండు.
-అప్పల ప్రమీల, గౌడవెల్లి
ఏండ్ల నాటి సమస్య పరిష్కారం అయ్యింది..
ఏండ్ల కిందటి ఇబ్బందుల తొలగిపోయాయి. ఎన్నో రోజు ల నుంచి ఇండ్ల మీది నుంచి పోతున్న కరెంట్ తీగలను మార్వాలని కోరుతున్నాం. అయినా ఎవరూ పట్టించుకోలేదు. మంత్రి మల్లారెడ్డి మనస్సున్న మారాజు. ఆయన సొంతంగా ఖర్చులు పెట్టుకొని, మా సమస్య తీర్చిండు. దేవుడు సల్లంగా సూడాలి.
-ఇజుమల్ల చంద్రమ్మ, గౌడవెల్లి