ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్య
మెరుగుపడుతున్న విద్యా ప్రమాణాలు
జూబ్లీహిల్స్,ఏప్రిల్30: ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యతో సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. సమర్థవంతమైన బోధనతో విద్యార్థులకు స్మార్ట్ బోర్డ్ విద్యను అందుబాటులోకి తెస్తున్నారు. డిజిటల్ విద్యతో పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగు పడుతూ బ్లాక్ బోర్డులు మరుగున పడనున్నాయి. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా మెరుగైన విద్యనందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లాలో ‘సమర్థనం’ సంస్థ డీఎక్స్‌సీ టెక్నాలజీస్ సంస్థ సౌజన్యంతో 26 ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ బోర్డులు ఏర్పాటు చేశారు.
ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు సంబంధిత ఉపాధ్యాయులు స్మార్ట్ బోర్డులపై డిజిటల్ తరగతులను బోధిస్తున్నారు. గతంలో బ్లాక్ బోర్డులపై సుద్దముక్కలతో రాస్తూ విద్యార్థులకు విశదీకరించడం వంటి పద్దతులకు స్వస్తి పలుకుతున్నారు. స్మార్ట్ బోర్డులలో రికార్డు అయివున్న తరగతులను సులభంగా బోధించడంతో పాటు ఆయా బోర్డులపైనే రాసే వీలుండటంతో బ్లాక్ బోర్డులతో తరగతుల నిర్వహణ తగ్గిపోయింది. జిల్లాలో 26 పాఠశాలల్లో 9 మంది ట్రైనర్స్‌తో పాఠశాల ఉపాధ్యాయులకు ఎప్పటికప్పుడు తర్ఫీదునిస్తూ డిజిటల్ విద్యను బలోపేతం చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని యూసుఫ్‌గూడ, జవహర్‌నగర్ ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ బోర్డులతో విద్యా బోధననందిస్తున్నారు.
ఎప్పటికప్పుడు రికార్డు
స్మార్ట్ బోర్డుల్లో ప్రీ ప్రైమరీ నుంచి పదో తరగతి వరకు రికార్డు అయి ఉంటాయి. వాటిని ఆయా తరగతుల ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించవచ్చు. బోర్డులపై ప్రత్యేక టూల్స్‌తో రాస్తూ విద్యార్థులకు మరింత సులువుగా బోధించవచ్చు. ఉపాధ్యాయులకు ఏమైనా సందేహాలుంటే టైనర్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వెంటనే వాటిని నివృత్తి చేస్తారు.
–ప్రియాంక, ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్