Hayath Nagar | హైదరాబాద్ : హయత్‌నగర్ మండలం కోహెడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోహెడలోని సర్వే నెంబర్ 951, 952లో ఉన్న ప్లాట్ల యజమానులకు, అక్కడే ఉన్న ఒక ఫామ్ హౌజ్ యాజమాన్యానికి మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. తాజాగా ఈ వివాదం ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే దాకా వచ్చింది.
కోర్టు ఆదేశాల మేరకు తమ ప్లాట్లను శుభ్రం చేసుకుంటున్న యజమానులను ఫామ్ హౌస్ నిర్వాహకులు అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా.. ప్లాట్ల యజమానులపై రాళ్లు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ప్లాట్ల యజమానులు పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
గతంలోనూ ప్లాట్ల యజమానులకు, ఫామ్ హౌస్ నిర్వాహకులకు మధ్య గొడవలు జరిగాయి. కొందరు వ్యక్తుల ప్లాట్లను కబ్జా చేసి ఓ రియల్టర్ ఫామ్‌హౌస్ నిర్మించాడని బాధితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రా స్పందించి భారీ బందోబస్తు మధ్య ఆ ఫామ్‌హౌస్‌ను నేలమట్టం చేసింది. కబ్జాదారుల నుంచి తమకు న్యాయం జరిగిందని అప్పట్లో ప్లాట్ల యజమానులు సంతోషం వ్యక్తం చేశారు.