Turkayamjal | తుర్కయాంజల్ : తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడ సర్వే నెంబర్ 240లో ఇరువర్గాలకు మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. స్థలాన్ని కబ్జాకు యత్నిస్తుండగా.. అడ్డుకోవడంతో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే.. సర్వే నెంబర్ 240, 241, 242లో సుమారు పదెకరాల స్థలం తమదేనని.. తమకు కోర్టు నుంచి ఉత్తర్వులు ఉన్నాయంటూ పలువురు ప్లాట్ల కడీలు, ఫ్రీ కాస్ట్ గోడలను బుధవారం తెల్లవారు జామున కూల్చివేసేందుకు యత్నించారు. కాలనీవాసులు, ప్లాట్ల యజమానులు కబ్జాకు యత్నిస్తున్న వారిని అడ్డుకున్నారు. దాంతో సదరు వ్యక్తులు కాలనీవాసులపైకి దాడికి దిగారు. దీంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. కాలనీ వాసులు, ప్లాట్ల యాజమానులు తిరగబడడంతో కబ్జాకు యత్నిస్తున్న వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యాడు. అక్కడ రాళ్ల దాడి జరిగినా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోకపోవడం గమనార్హం.