సికింద్రాబాద్, జులై 12: సికింద్రాబాద్ అమ్మవారి బోనాల జాతర సందర్భంగా చెక్కుల పంపిణీలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. నువ్వా నేనా అనే స్థాయికి చేరింది. ఓ క్రమంలో తోపులాట దాకా వచ్చింది. చె క్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంటే కరెంటు పోయింది. దీంతో కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది.. అని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినదించారు.
బీఆర్ఎస్ నాయకులు ప్రొటోకాల్ పాటించడం లేదని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున నినాదాలు చేసుకున్నారు.కొద్దిసేపటికి కరెంట్ రావడంతో నాయకులు బీఆర్ఎస్ పార్టీ వచ్చింది.. కరెంట్ మళ్లీ వచ్చిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులు జై కేసీఆర్.. జై జై కేసీఆర్..జై పజ్జన్న.. జై జై పజ్జన్న అంటూ పెద్ద ఎత్తున నినదించారు. చిలకలగూడ పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
రూ.కోటి 12 లక్షల చెక్కులు పంపిణీ..
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన 212 దేవాలయాలకు బో నాలు నిర్వహణకు నిధుల చెక్కలను సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ శనివారం పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, నగర డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, కార్పొరేటర్లు హేమ, ప్రసన్న లక్ష్మి , సునీత , శైలజ, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, వినోద్ కుమార్, అధికారులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో సీతాఫల్ మండిలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో పద్మారావు గౌడ్ చెక్కులను పంపిణీ చేశారు. రూ.కోటి 12 లక్షల చెక్కులను అందజేసినట్లు తెలిపారు.