ఎల్బీనగర్, ఫిబ్రవరి 13 : మద్యం మత్తులో ఇద్దరు స్నేహితులు ఘర్షణ పడిన ఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాలా వద్ద ఫుట్‌పాత్‌పై ఉంటున్న శ్రీనివాస్, జమీల్ అనే మిత్రులు మలక్‌పేట్ గంజ్‌లో పని చేస్తారు. సోమవారం రాత్రి దిల్‌సుఖ్‌నగర్‌లోని కోణార్క్ థియేటర్లో ఇద్దరూ సెకండ్ షో సినిమా చూసి, రాత్రి ఒంటి గంటకు బయటకు వచ్చి మద్యం తాగారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
తాగిన మైకంలో జమీల్ మద్యం సీసా పగులగొట్టి శ్రీనివాస్ మెడపై దాడి చేయగా తీవ్ర గాయం అయ్యింది. ఈ వివాదం అనంతరం ఇద్దరూ చాదర్‌ఘాట్ వైపు వెళ్లగా మలక్‌పేట్ చర్మాస్ వద్ద శ్రీనివాస్ పడిపోయాడు. స్థానికులు గమనించి డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో చాదర్‌ఘాట్ పోలీసులు వచ్చి శ్రీనివాస్‌ను ఉస్మానియా దవాఖానకు తరలించారు. అనంతరం ఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగినట్లుగా తెలుసుకుని సరూర్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు. సరూర్‌నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.