బంజారాహిల్స్,జూన్ 1: మద్యం మత్తులో స్నేహితుల మధ్య ప్రారంభమైన గొడవ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకుంది. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని బోళానగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్(33) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అతడితో పాటు మల్లేప్లల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్న అహ్మద్ హుస్సేన్, మరికొంతమంది స్నేహితులు కలిసి ఆదివారం రాత్రి బంజారాహిల్స్ రోడ్ నెం 1లోని హయత్ ప్లేస్ సమీపంలోని ఆటో స్టాండ్‌లో తమ ఆటోల్లో కూర్చుని మద్యం సేవించారు.
మద్యం సేవించడం పూర్తయిన తర్వాత ఖాళీ బాటిళ్లను రోడ్డుపై పారవేస్తున్న అహ్మద్ హుస్సేన్‌ను ఇమ్రాన్ దూషించడంతో గొడవ ప్రారంభమయింది. మాటామాటా పెరగడంతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఇమ్రాన్‌పై పిడిగుద్దులతో అహ్మద్ హుస్సేన్ విరుచుకుపడడంతో కుప్పకూలాడు. అతడిని స్థానికులు మహావీర్ దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు ఫిర్యాదును అందుకున్న పోలీసులు నిందితుడు అహ్మద్ హుస్సేన్‌ను అరెస్ట్ చేశారు.