నాలాల పూడికతీతపై హైడ్రా చేతులెత్తేసింది. ఒక్క ఏడాదితోనే ఇక తాము అందులో జోక్యం చేసుకోవద్దనే నిర్ణయానికొచ్చింది. గత ఏడాది నాలాల పూడికతీత మొదలు ముంపు ప్రాంతాల సమస్య పరిష్కారం వరకు అంతా తామే అన్నట్లుగా వ్యవహరించింది. ఈ పనుల్ని జీహెచ్ఎంసీకి అప్పగిస్తే అవినీతి జరిగిందంటూ తన భుజాన వేసుకుంది. కానీ ప్రకటించిన వీజీ కాదనే విషయం క్షేత్రస్థాయిలోకి దిగిన తర్వాత తెలిసింది. గతేడాది నాలాల పూడికతీత గందరగోళంగా మారడంతో పాటు ఆ ప్రక్రియ శాఖల మధ్య నలిగిపోయింది. ఫలితంగా పలుచోట్ల నాలాలు ఉప్పొంగి వరద నీరు కాలనీలను ముంచెత్తిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గత ఏడాది అనుభవమో.. ఏమోగానీ! ఈసారి నాలాల పూడికతీత నుంచి హైడ్రా తప్పుకుంది. ఇదే విషయాన్ని తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీకి సహకరిస్తామే తప్ప.. నాలాల పూడికతీత ప్రక్రియను బల్దియానే చేపడుతుందన్నారు.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 2 (నమస్తే తెలంగాణ)
అనుభవం లేని హైడ్రా గతేడాది పూడికతీత పనులు చేపట్టడంతో ఆ ప్రక్రియ అంతా గందర గోళంగా మారింది. ఆ ప్రభావం వర్షాకాలంలోనూ కనిపించి.. పలుచోట్ల జనం ఇబ్బందులు పడ్డారు. ?
‘నగరంలో జూలై రెండో వారం దాకా వర్షాలు కురిసే అవకాశం లేదు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమవుతాయని వాతావరణ శాఖ చెబుతున్నది. కాబట్టి వరద ముంపును నియంత్రించేందుకు వర్షాలు కురిసే సమయానికి ముందస్తు చర్యలు చేపడతాం.
జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం. వర్షాకాలంలో జీహెచ్ఎంసీతో కలిసి పనిచేస్తాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. బాటిల్ నెక్ నాలాలు, పూడికతీత పనులు కూడా జీహెచ్ఎంసీ చేపడుతున్నది. వర్షాకాలంలో మేము జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పనిచేస్తాం. కూలేందుకు సిద్ధంగా ఉన్న చెట్ల తొలగింపు పనులు కూడా వర్షాకాలంలోనే చేస్తాం…’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం జరిగిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి గత సంవత్సరం చోటుచేసుకున్న పరిణామాలను చూస్తే ఇందుకు పూర్తిగా భిన్నం. అసలు జీహెచ్ఎంసీకి సంబంధం లేకుండానే నాలాల పూడికతీతపై హైడ్రా నేరుగా రంగంలోకి దిగింది.
ఈ మేరకు హైడ్రా అధికారికంగానే ప్రకటనలు విడుదల చేసింది. కృష్ణానగర్ ప్రాంతంలో నాలా ఎనిమిది అడుగుల లోతు ఉంటే ఆరడగులు లోతు పూడిక ఉందని, దానిని హైడ్రా తొలగిస్తుంటే స్థానికులు ఔరా! అని ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు ప్రకటనలు విడుదల చేశారు. ఏకంగా 27వేల చోట్ల హైడ్రా పూడికతీతను తొలగించిందని క్లెయిమ్ చేసుకున్నారు. ఈ క్రమంలో నాలాల పూడికతీత సరిగా జరగడంలేదంటూ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు కూడా వచ్చాయి. జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం పూడిక తీత ప్రక్రియతో తమకెలాంటి సంబంధంలేదని, అంతా హైడ్రా చూసుకుంటుందని కూడా మీడియాకు స్పష్టం చేశారు.
కొన్నిచోట్ల నాలా రిటైయినింగ్ వాల్స్‌ను కూడా జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగంతో సంబంధం లేకుండానే హైడ్రా నిర్మించడం గమనార్హం. అయితే దశాబ్దాల తరబడి అనుభవం ఉన్న కాంట్రాక్టర్లతో పాటు సాంకేతికంగానూ జీహెచ్ఎంసీ నాలాల పూడికతీత ప్రక్రియను చేపట్టేందుకు ఇంజినీరింగ్ విభాగం ఉంది. కానీ హైడ్రా పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవడంతో జీహెచ్ఎంసీ ప్రేక్షకపాత్ర పోషించింది. అనుభవంలేని హైడ్రా ఆ పనులు చేపట్టడంతో అది సక్రమంగా జరగలేదు. దీంతో గత ఏడాది పూర్తిగా నాలాల పూడికతీత అనేది గందరగోళంగా మారింది. ఆ ప్రభావం వర్షాకాలంలోనూ కనిపించి పలుచోట్ల జనం ఇబ్బందులు పడ్డారు.
నాలాల పూడికతీత బల్దియాదేనన్న కమిషనర్
ఈ ఏడాది నాలాల పూడికతీత ప్రక్రియను పూర్తిగా జీహెచ్ఎంసీ నిర్వహిస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం నిర్వహించిన ప్రెస్మీట్లో స్పష్టం చేయడం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది అంత హడావిడి చేసిన హైడ్రా ఇప్పుడెందుకు ఆ బాధ్యతను పక్కన పెట్టిందని ఇంజినీరింగ్ వర్గాల్లోనూ చర్చ సాగింది. ముఖ్యంగా వేల కిలోమీటర్లున్న నాలాల్లో పూడికతీత అనేది అంత సులువైన ప్రక్రియ కాదని, ఇంజినీరింగ్ విభాగంతో పాటు క్షేత్రస్థాయిలో సిబ్బందిలేని హైడ్రా దీన్ని ఎలా నిర్వహిస్తుంది? అని ఓ సీనియర్ ఇంజినీర్ అభిప్రాయపడ్డారు.
గత ఏడాది హైడ్రా చేపట్టిన ప్రక్రియ విజయవంతమైతే ఈసారి కూడా అదేరీతిన కొనసాగేదని, కానీ అనుకున్నంత సులువుగా క్షేత్రస్థాయిలో ఆ పనులు నిర్వహించడం సాధ్యంకాదని తత్వం బోధపడినందునే హైడ్రా వెనక్కి తగ్గిందని అన్నారు. హైడ్రా అధికారులు, కిందిస్థాయి సిబ్బందిలోనూ ఇదే అభిప్రాయం ఉందని, తమకు సంబంధంలేని పనిని భుజాన వేసుకోవడంపై వారిలోనూ అసంతృప్తి వ్యక్తమైనందునే ఈసారి కేవలం జీహెచ్ఎంసీకి సహకరిస్తామనే ప్రకటన కమిషనర్ రంగనాథ్ నుంచి వచ్చిందని పలువురు కుండబద్దలు కొట్టారు.