Gut Microbiome | పేగుల్లో ఉండే సూక్ష్మజీవుల (గట్ మైక్రోబయోమ్) నిర్మాణం, ఆహారపు అలవాట్లు, కొలొరెక్టల్ క్యాన్సర్ (పెద్దపేగు క్యాన్సర్) మధ్య కీలక సంబంధం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ఆహారంలో పీచు (డైటరీ ఫైబర్) తక్కువగా తీసుకునే వారిలో క్యాన్సర్‌కు సంబంధించిన గట్ మైక్రోబయోమ్ లక్షణాలు ఎక్కువగా కనిపించగా, పీచు పదార్థాల వినియోగాన్ని పెంచడం వల్ల ఈ ప్రమాదకర సూక్ష్మజీవుల నమూనా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయన ఫలితాలు సెల్ హోస్ట్ అండ్ మైక్రోబ్ (Cell Host and Microbe) జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. పరిశోధన ప్రకారం పీచు అధికంగా ఉండే ఆహారం పేగుల్లోని సూక్ష్మజీవుల సమతుల్యతను మెరుగుపరచడం ద్వారా కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో, వ్యాధి పురోగతిని నియంత్రించడంలో లేదా నివారణలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని సూచించింది.
ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు గతంలో ప్రచురితమైన 27 అధ్యయనాలకు చెందిన మొత్తం 6,779 గట్ మైక్రోబయోమ్ సీక్వెన్సింగ్ వివరాలను మళ్లీ విశ్లేషించారు. అలాగే 906 పేగు కణజాల నమూనాలను పరిశీలించి, మల నమూనాల్లో కనిపించే సూక్ష్మజీవుల సంకేతాలను ట్యూమర్ కణజాలంలో నేరుగా ఉన్న సూక్ష్మజీవులతో పోల్చారు. ఈ విశ్లేషణలో కొలొరెక్టల్ క్యాన్సర్‌తో సంబంధం ఉన్న ఒక స్థిరమైన సూక్ష్మజీవుల నమూనాను (మైక్రోబయోమ్ సిగ్నేచర్) పరిశోధకులు గుర్తించారు. పేగు కణజాల నమూనాల్లో ఈ సూక్ష్మజీవులను క్యాన్సర్ ప్రారంభ దశలోనే గుర్తించగా, మల నమూనాల్లో మాత్రం ప్రారంభ దశ క్యాన్సర్ లేదా పెద్దపేగు పైభాగంలో ఉన్న ట్యూమర్ల విషయంలో గుర్తించే కచ్చితత్వం కొంత తక్కువగా ఉన్నట్లు తేలింది. పరిశోధకుల ప్రకారం, మొత్తం 34 వేర్వేరు అధ్యయన సమూహాల నుంచి సేకరించిన 6,779 మల నమూనాలు, 906 పేగు కణజాల నమూనాల ఆధారంగా నిర్వహించిన అతిపెద్ద మైక్రోబయోమ్ మెటా-విశ్లేషణల్లో ఇది ఒకటిగా నిలిచింది.
అధ్యయనంలో పీచు పదార్థాల వినియోగం, కొలొరెక్టల్ క్యాన్సర్ మైక్రోబయోమ్ స్కోర్ మధ్య స్పష్టమైన విలోమ సంబంధం ఉన్నట్లు గుర్తించారు. అంటే పీచు ఎక్కువగా తీసుకునే వారిలో క్యాన్సర్‌కు సంబంధించిన మైక్రోబయోమ్ లక్షణాలు తక్కువగా కనిపించాయి. క్యాన్సర్ రోగులతోపాటు ఆరోగ్యవంతులలో కూడా ఇదే ధోరణి కనిపించింది. అలాగే ఆహారంలో పీచు పరిమాణాన్ని పెంచే చర్యలు చేపట్టినప్పుడు కొలొరెక్టల్ క్యాన్సర్ మైక్రోబయోమ్ స్కోర్ తగ్గినట్లు పరిశోధనలో వెల్లడైంది. ఇది ఆహారపు అలవాట్లు పేగు సూక్ష్మజీవుల నిర్మాణాన్ని ప్రభావితం చేయడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే అవకాశాన్ని సూచిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనంలో ఉపయోగించిన విధానం వల్ల ఒకే ప్రాంతం, ఒకే వయసు వర్గం లేదా ఒకే సీక్వెన్సింగ్ పద్ధతికి పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వర్తించే కొలొరెక్టల్ క్యాన్సర్ మైక్రోబయోమ్ సిగ్నేచర్‌ను గుర్తించగలిగారు. ప్రారంభ వయసులో వచ్చే క్యాన్సర్‌తో పాటు వృద్ధాప్యంలో వచ్చే కొలొరెక్టల్ క్యాన్సర్ కేసుల్లో కూడా ఇదే నమూనా కనిపించినట్లు వెల్లడైంది.
పరిశోధనలో వినియోగించిన మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్‌ను ఇప్పటికే అందుబాటులో ఉన్న మైక్రోబయోమ్ డేటాపై కూడా ప్రయోగించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో ఆహారం, జీవనశైలి వంటి అంశాలు పేగు సూక్ష్మజీవులపై చూపే ప్రభావాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే వేలాది మంది ప్రజలకు సంబంధించిన ఓపెన్ మైక్రోబయోమ్ డేటాను సమగ్రంగా విశ్లేషించడం ద్వారా ఒక్కో అధ్యయనంలో గుర్తించలేని ముఖ్యమైన నమూనాలను వెలికితీయగలిగామని పరిశోధకులు తెలిపారు. భవిష్యత్తులో కొలొరెక్టల్ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం, నివారణ చర్యలను మెరుగుపరచడం వంటి అంశాల్లో ఈ అధ్యయనం ఉపయోగపడే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు.