సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీలో కాదేది అవినీతికి అనర్హం అన్నట్లు దోపిడీపర్వం సాగుతోంది. తాజాగా ఎంటమాలజీ విభాగంలో నయా దందా వెలుగులోకి రావడం బల్దియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో ఉద్యోగుల విధుల హాజరు పారదర్శకంగా ఉండాలని భావించి బయో మెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే బయో మెట్రిక్ విధానం ఆమలు కాకముందు కొంతమంది కాంట్రాక్టర్లు, మరికొందరు అవినీతి అధికారులు కలిసి జీహెచ్ఎంసీ ఖజానాను లూటీ చేశారు. కొన్ని విభాగాల్లో ఉద్యోగులు లేకపోయినా ఉన్నట్లుగా చూపించి.. డబ్బులు కొట్టేసిన అధికారులు, కాంట్రాక్టర్లు మరికొన్ని విభాగాల్లో ఉద్యోగులు, కార్మికులు సెలవుల్లో ఉన్న బిల్లులు పెట్టే సమయంలో వారు నెలలో పూర్తి రోజులు పని చేసినట్లుగా చూయించి బల్దియా ఖజానా నుంచి బిల్లులు డ్రా చేశారు.
అలా డ్రా చేసిన డబ్బులను సంబంధిత కార్మికులు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయకుండా నేరుగా కాంట్రాక్టర్ అధికారులు పంచుకున్నారు. కూకట్పల్లి, ఎల్బీనగర్, చార్మినార్ జోన్లలోని ఎంటమాలజీ విభాగంలో 33 మంది ఉద్యోగుల జీతాల చెల్లింపులలో అక్రమాలు జరిగాయన్న చర్చపై అంతర్గత విచారణ జరుగుతున్నట్లు తెలిసింది. మచ్చుకు కొన్ని పరిశీలిస్తే…కూకట్పల్లి జోన్లో అసిస్టెంట్ ఎంటమాలజీ (సర్కిల్-25) 2022 ఫిబ్రవరి 21 నుంచి 20-3-22వ తేదీ వరకు 12 రోజుల పాటు లీవ్‌లో ఉండగా.. పూర్తి స్థాయి జీతాన్ని డ్రా చేశారు. ఎల్బీనగర్ జోన్లో అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ (మహిళా ఉద్యోగి) ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగం చేస్తుండగా.. 21-8-23 నుంచి 20-9-23 రోజుల వరకు చికిత్స కోసం సెలవు పెట్టారు. దవాఖాన బిల్లును క్లెయిమ్ చేసుకునేందుకు వెళ్లగా పూర్తి స్థాయి జీతం తీసుకున్నట్లుగా ఈపీఎఫ్ విభాగం తేల్చింది.
మెడికల్ లీవ్‌లో ఉన్నానని సదరు ఉద్యోగి చెప్పడం, సంబంధిత ఏజెన్సీని నిలదీయగా..ఉద్యోగం కావాలా? డబ్బులు కావాలా? అని సదరు ఏజెన్సీ బెదిరించింది. కూకట్‌పల్లిలో జోన్లో మరో అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్కు కొవిడ్ సెలవు రోజుల్లోనూ పూర్తి జీతాన్ని డ్రా చేయడం అధికారులకే చెల్లింది. అటెండెన్స్ రిజిస్టర్ లీవ్‌లు ఉన్నప్పటికీ కార్మికుల పేరిట పూర్తి జీతాలు అందినంత దండుకున్నారని ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ఎంటమాలజీ, శానిటేషన్ కంప్యూటర్ ఆపరేటర్లు, సెక్యూరిటీ విభాగంలో ఇలాంటి అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా అనారోగ్యం, ప్రమాదాలు జరిగినప్పుడు, మెటర్నటీ సెలవుల్లో ఉన్న మహిళా ఉద్యోగుల జీతాలతో పాటు కొవిడ్ సెలవులో ఉన్న ఉద్యోగుల జీతాలను సైతం కాంట్రాకర్లు, కొందరు అధికారులు కలిసి తమ జేబుల్లో వేసుకున్నట్లు తెలిసింది.
అటెండెన్స్ వేసి..
ఎంటమాలజీ విభాగంలో పనిచేసే అసిస్టెంట్ ఎంటమాలజిస్టుల (ఏఈ) జీతాలను ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఒక ఉన్నతాధికారి, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్లు కలిసి డ్రా చేసినట్లు సమాచారం. ఏఈలు సెలవుల్లో ఉండి పని చేయని రోజులలో సైతం అటెండెన్స్ వేసి జీతాలు డ్రా చేశారన్నది ప్రధాన ఆరోపణ. కొంతమంది అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు ఆరోగ్య సమస్యల కారణంగా సెలవులు పెట్టి నాలుగు ఐదు వారాలు విధులకు హాజరు కాలేదు. మరికొందరు యాక్సిడెంట్ కారణంగా నెల వరకు విధులకు అటెండ్ కాలేదు. కొవిడ్ సమయంలో కొవిడ్ బారిన పడ్డ కొంతమంది ఉద్యోగులు సైతం సెలవులు పెట్టగా వాటిని కూడా పని చేసినట్లు అటెండెన్స్ వేసుకొని కాంట్రాక్టర్లు ప్రధాన కార్యాలయం అధికారులు ఎంచక్కా కొట్టేసినట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది.
సమగ్ర విచారణ జరిపిస్తే…
అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్లకు ప్రతి నెల వేతనం చెల్లించే ఓ సెక్యూరిటీ సర్వీసెస్, ఎంటమాలజీ విభాగంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, మరో సీనియర్ అధికారి కలిసి వారి జీతాలు డ్రా చేయడంలో కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. 33 మంది అసిస్టెంట్ ఎంటమాలజిస్టుల్లో నెలల తరబడి ఒక్కరూ కూడా సెలవుపై వెళ్లినట్లు చూపించి పూర్తి జీతాన్ని నొక్కేసారంటే కాంట్రాక్టర్లు, అధికారులు ఎంత ఆర్గనైజ్డ్ గా పనిచేశారో అర్థం చేసుకోవచ్చు. కొవిడ్ టైమ్ 2020 గడిచిన ఐదేండ్లుగా ఒక కాంట్రాక్ట్ ఏజెన్సీ, ప్రధాన కార్యాలయంలోని అధికార గణం ఉద్యోగుల సెలవులను పైసల రూపంలోకి మార్చుకున్నారని తెలుస్తున్నది. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, చార్మినార్ జోన్ల పరిధిలో అసిస్టెంట్ ఎంటమాలజిస్టుల జీతాలను ఈ విధంగా కాంట్రాక్టర్లు తమ ఖాతాకు మళ్లించుకున్నారని, 21 ఆగస్టు 23 నుంచి వరుసగా ఐదు నెలల పాటు ఎంటమాలజీ విభాగంలో జరిగిన నెలవారీ వేతనాలపై సమగ్ర విచారణ జరిపిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.