Musi River | సిటీబ్యూరో, నవంబర్ 10(నమస్తే తెలంగాణ): కాలుష్య కారకాలు, మురుగునీటిని నియంత్రించకుండా, నదికి ఇరువైపులా నిర్మించే ఆకాశ హర్మ్యాలు, అద్దాల మేడలతో మూసీ నది పరిరక్షణ అసాధ్యమని పౌర సమాజం ఉద్ఘాటించింది. రూ.1000 కోట్ల అంచనా వ్యయంతో మూసీలో గోదావరి నీళ్లను తీసుకువచ్చేలా, రూ.5 వేల కోట్లతో ఎస్టీపీల నిర్మాణం, రూ.25 వేల కోట్లతో మూసీ ప్రక్షాళన చేయొచ్చని గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం శాస్త్రీయ విధానాలను డెవలప్ చేసిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నది ప్రక్షాళన కోసం ఐక్య రాజ్య సమితి ప్రత్యేక విధానాన్ని రూపొందించిందని, కానీ, అవేవి పట్టించుకోకుండా కూల్చివేతలు, పర్యటనలు, నిధుల స్వాహా కోసమే పునరుజ్జవం ప్రాజెక్టును రేవంత్ సర్కార్ చేపట్టినట్లుగా ఉందని నగర పౌరులు అన్నారు.
ఐరాస చెప్పినట్లుగా నిర్వాసితులకు రిహాబిలిటేషన్, పరిహారం చెల్లించి, నది వెంబడి నిర్మాణాలను కూలగొట్టకుండా రెగ్యులైజ్ చేసి, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ద్వారా ఉద్యోగ, జీవ నోపాధి కల్పించిన తర్వాత నిర్మాణాలను తొలగించాలని చెబుతున్నా, పేదల ఇండ్ల పైకి కాంగ్రెస్ సర్కార్ బుల్డోజర్లను ఎగదోస్తుందన్నారు. ఇక పర్యావరణ, భూ భౌగోళిక, పురపాలక, సీవరేజీ, రెవెన్యూ, ఇరిగేషన్ వంటి రంగాల్లో నిష్ణాతులైన నిపుణుల సమక్షంలో జరగాల్సిన మూసీ పునరుజ్జీవం కేవలం సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లో జరిగిపోతుందన్నారు. చిత్తశుద్ధి లేకుండా, ధనాపేక్షతో చేపడుతున్న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుతో జనాలకు, జీవనదికి ఒరిగే ప్రయోజనమే లేదని పలువురు పర్యావరణ, సామాజిక కార్యకర్తలు స్పష్టం చేశారు.
సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ైక్లెమేట్ ఫ్రంట్ సంస్థ ఆధ్వర్యంలో ‘సేవ్ మూసీ’ పేరిట ఆదివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మూసీ ప్రక్షాళన పేరిట రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న విధానాలు, ఇప్పటికీ దేశంలో జరిగిన నదీ సుందరీకరణ ప్రాజెక్టుల స్థితిగతులు, ప్రక్షాళన పేరిట జరిగిన అవినీతి బాగోతాలు, పర్యావరణ పర్యవసానాలు వంటి అంశాలపై చర్చించారు. శాస్త్రీయ విధి విధానాలు లేకుండా మూసీ పేరిట జరిగే ప్రాజెక్టులను పౌర సమాజం తీవ్రంగా వ్యతిరేకించారు.
ఎలాంటి డీపీఆర్ లేకుండా, నిర్మాణాత్మకమైన పునరావాస విధానం లేని మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. ఈ ప్రాజెక్టుతో కేవలం నిధుల స్వాహా చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తోందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధంగా ఇప్పటివరకు మూసీ సుందరీకరణ, నందనవనం, పునరుజ్జీవం వంటి ప్రాజెక్టులన్నింటిని వ్యతిరేకిస్తామని తెలంగాణ వాది, సీనియర్ జర్నలిస్ట్ విఠల్ స్పష్టం చేశారు. థేమ్స్ నదిపై జరిగిన ప్రయోగాలన్నీ విఫలమయ్యాయని, కొరియాలో జరిగిన నదీ ప్రక్షాళనపై జరిగిన అవినీతితో కాంట్రాక్టర్లు, అధికారులకు ఏడేళ్ల శిక్ష పడిందన్నారు. ఇక గుజరాత్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్‌ను అక్కడి హైకోర్టు తప్పు పట్టిందన్నారు. ఇక నమామి గంగా ప్రాజెక్టుతో కూడా పూర్తి స్థాయి ఫలితాలు రాలేవనే విషయాన్ని రేవంత్ సర్కార్ గుర్తించాలన్నారు.
సహజ సిద్ధమైన నది వ్యవస్థను పరిగణనలోకి తీసుకోకుండా చేపట్టే ప్రాజెక్టులతో ప్రయోజనమే ఉండదని విఠల్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టుల్లో నిర్వాసితులను కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. అనంతరం, జమ్ము కాశ్మీర్ నుంచి వచ్చిన ైక్లెమేట్ ఫ్రంట్ జాతీయ వ్యవస్థాపకులు అన్మోల్ మాట్లాడుతూ, దేశంలో ఇప్పటివరకు చేపట్టిన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులన్నీ ఫెయిలయ్యాయన్నారు. దీంతో ప్రజల జీవన ప్రమాణాలు ఏ మాత్రం మారలేదని, ప్రధానంగా పారిశ్రామిక, మానవ వ్యర్థాలను నదీలోకి చేరకుండా అడ్డుకోకపోతే ఏ నదీ ప్రక్షాళన సాధ్యం కాదన్నారు.
దక్షిణ భారతంలో ఎన్నో జీవనదులు ఉన్నాయని, వీటన్నింటిని కూడా కాలుష్య కారకాల నుంచి కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. కానీ, అవేవి చేయకుండా కేవలం నిధుల స్వాహా కోసమే ప్రాజెక్టులను చేపడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. దేశంలోనే చేపట్టిన మొట్టమొదటి రివర్ ప్రాజెక్టు సబర్మతి కూడా ఫెయిలైందన్నారు. దీంతో పర్యావరణ విధ్వంసం, నిధుల దుర్వినియోగమే జరిగిందన్నారు. పారిశ్రామిక వ్యర్థాలు, మానవ వ్యర్థాలను శుద్ధి చేయకుండా నదీ ప్రక్షాళన ఎలా జరుగుతందన్నారు? పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఎస్టీపీల నిర్మాణం చేయకుండా మూసీ పునరుజ్జీవం కూడా సాధ్యం కాదన్నారు. కాస్మోటిక్ రివర్ డెవలప్మెంట్తో దేశంలో నది ప్రక్షాళన కార్యక్రమాలన్నీ నిధులు దుర్వినియోగం జరిగిందన్నారు.
మూసీ పునరుజ్జీవం పేరిట ప్రభుత్వం చేపట్టిన అశాస్త్రీయ విధానాలతో నది వెంబడి జీవ వైవిధ్యం దెబ్బతింటుందని బయోడైవర్సిటీ నిపుణులు ఉమర్ అభిప్రాయ పడ్డారు. మూసీనదిలో అరుదైన చేప జాతులు ఉండేవనీ, అనంతగిరి నుంచి వాడపల్లి వరకు వచ్చేసరికి వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. యథేచ్ఛగా చేరుతున్న పారిశ్రామిక, ఫార్మా, భారలోహ వ్యర్థాలతో మూసీ నీళ్లతో సాగు చేసే పంటలు కూడా నిరుపయోగంగా మారుతున్నాయన్నారు. అదే విధంగా ఇందులో జీవనం సాగిస్తున్న జల చరాలు మానవాళికి ప్రమాదకరంగా మారినట్లుగా పలు అధ్యయనాల్లో తేలిందనే విషయాన్ని గుర్తు చేశారు.
ఒకప్పటి స్వచ్ఛమైన జలాలతో ప్రవహించే మూసీ నది… ఇప్పుడే కాలుష్య కాసారంగా ఎందుకు మారిందనే విషయాన్ని పాలకులు గుర్తించాలన్నారు. తెలంగాణ వాది పృథ్వీరాజ్ మాట్లాడుతూ మూసీ నది అభివృద్ధిని కేవలం రాజకీయ కోణంలోనే చూడాలన్నారు. కొత్త టెక్నాలజీ పేర మూసీ పేరిట రేవంత్ సర్కార్ దోపిడీ చేసేందుకు సిద్ధమైందన్నారు. మూసీ పేరిట సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ, హైదరాబాద్ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మూసీ నది చివరన ఉన్న వాడపల్లిలో పర్యటించిన రేవంత్ రెడ్డి, హైదరాబాద్ నగరంలోని యథేచ్ఛగా మూసీలోకి వదులుతున్న పారిశ్రామిక వాడల్లో ముందుగా పర్యటించాల్సిందని పేర్కొన్నారు. పటాన్ చెరు లాంటి పారిశ్రామిక వ్యర్థాల నుంచి వచ్చే ఫార్మా వ్యర్థాలను శుద్ధి చేసే దమ్ముందా? అని అన్నారు.
మూసీ పేరిట, హైడ్రా పేరిట కేవలం అమాయక పేద ప్రజలను బలి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఇప్పటివరకు జల వనరులను అన్యాక్రాంతం చేసిన ఏ ఒక్క ఫాం హౌజ్‌ను రేవంత్ సర్కార్ ఎందుకు కూల్చలేదన్నారు. దేశంలో రెండు రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉందని, ఇక్కడ సంపాదించిన డబ్బులను ఇతర రాష్ర్టాల్లో అధికారం కోసం ఖర్చు పెట్టే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్నారు. నిపుణుల పర్యవేక్షణలోనే మూసీ పునరుజ్జీవం జరుగుతుందంటున్న రేవంత్ రెడ్డి, ఆ నిపుణుల జాబితాను బయటపెట్టాలన్నారు.
మూసీ వెంబడి 2005లోనే పాదయాత్ర చేసి, కాలుష్య వ్యర్థాలను నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయాన్ని పృథ్వీరాజ్ గుర్తు చేశారు. మూసీ వెంబడి భారీ విగ్రహాలను ఏర్పాటు చేయడం కంటే ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధానాలను చిత్తశుద్ధితో అమలు చేయాలన్నారు. పునరావాసం కల్పించకుండా, కేవలం పేదల నివాసాలను తొలగిస్తుందన్నారు. మూసీ అభివృద్ధి చేయాల్సిందే.. కానీ, శాస్త్రీయ విధానంలో జరగాలన్నారు. కేవలం పేద, మధ్య తరగతి వర్గాలు నివాసాలను కూల్చివేయొద్దన్నారు.
ప్రైవేటు కంపెనీలు మూసీ పేరిట ఎందుకు ఖర్చు చేస్తాయని, కేవలం వ్యాపార కోణంలోనే పెట్టుబడులు పెడతాయన్నారు. పారిశ్రామిక, మానవ, సీవరేజీ వ్యర్థాలను నియంత్రించకుండా, మూసీ ప్రక్షాళన సాధ్యమే కాదన్నారు. అప్పటివరకు ప్రభుత్వం చేసే ప్రయత్నాలతో ఒరిగేదేమీ లేదని స్పష్టం చేశారు. అనంతగిరి కొండల్లో నుంచి వాడపల్లి వరకు మూసీ వెంబడి పర్యటించి పరీవాహక ప్రాంత ప్రజల జీవన స్థితగతులపై ైక్లెమేట్ ఫ్రంట్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో అధ్యయనం చేశామని నిర్వాహకులు రుచిత్ వివరించారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నామని, శాస్త్రీయ విధానంలో, పర్యావరణహితమైన, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టును చేపట్టేంత వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.