సిటీబ్యూరో, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం మరోసారి ధోఖానిచ్చింది. సిటీ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండగా, ఖాళీ చేతులతోనే లేవని సమాధానం చెప్పింది. భారీ ప్రాజెక్టులను కూడా పరిగణనలోకి తీసుకోకుండా, కేంద్రం నుంచి వచ్చే నిధులపై మొదలుపెట్టిన ప్రాజెక్టుల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చింది. చేతిలో చిల్లి గవ్వ లేకున్నా…వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రతిపాదనలను రూపొందించిన రేవంత్ సర్కారు… ఇక కేంద్రం నుంచి వచ్చే నిధులపై గంపెడాశలు పెట్టుకున్నది. వీటన్నింటిపై నీళ్లు చల్లిన చందంగా… నగరాభివృద్ధిని విస్మరించి చుక్కలు చూపించింది. దీంతో తలమానికమైన ప్రాజెక్టులుగా కాంగ్రెస్ సర్కారు చెప్పుకుంటున్నా మూసీ ప్రక్షాళన, మెట్రో రెండో దశ విస్తరణకు ప్రత్యేక కేటాయింపులు లేకపోవడంతో… కేంద్రం ఇచ్చే అర్బన్ గ్రాంట్లను శరణ్యంగా మారే పరిస్థితి వచ్చింది.
విశ్వనగరంగా ఎదుగుతూ, దేశంలోని అన్ని ప్రధాన మెట్రో నగరాల కంటే విస్తరిస్తున్న మహానగరానికి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నయా పైసా రాలేదు. ఓవైపు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామంటూ కాంగ్రెస్ కాగితాలపై ప్రణాళికలు రూపొందిస్తుంటే… మరోవైపు నిధులు ఇవ్వకుండా నగరాన్ని కేంద్రం దోబూచులాడుతోంది. హైదరాబాద్ నగరానికి ఎంతో కీలకమైన రెండో దశ మెట్రో విషయంలో భారీ అశలు, అంచనాలతో బడ్జెట్ ప్రతిపాదనలకు అనుమతులు ఇవ్వకుండా, కనీసం బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించకుండా, రాష్ట్ర సర్కారు, కేంద్రం కలిసి హైదరాబాద్ వాసులను జీవనప్రమాణాలను ప్రశ్నార్థకంగా చేస్తోంది.
కేంద్ర అనుమతి కోసం ఫేజ్-2మెట్రో డీపీఆర్ వెళ్లిన నాటి నుంచి ఇప్పటి వరకు పలుమార్లు కేంద్ర సర్కారు పెద్దలను కలిసిన కాంగ్రెస్ నేతలు, నగరానికి బడ్జెట్లో కేటాయింపుల ఆవశ్యకతను మాత్రం చెప్పలేకపోయారు. ఆదివారం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ర్టానికి ప్రత్యేక కేటాయింపులు ఉంటాయని ఆశించారు. కానీ ప్రత్యేక కేటాయింపుల ఊసే లేకుండా, గ్రాంట్లను ఆశ చూపి వదిలేసింది. మూసీ ప్రక్షాళనకు రూ. 30వేల కోట్లు, మెట్రో ఫేజ్-2 కోసం మరో రూ. 15వేల కోట్లు ప్రత్యేకంగా కేటాయించాలనే ప్రతిపాదనలను కూడా పట్టించుకోలేదు.

ఒక్క రూపాయి కూడా ..
గతేడాది కూడా గ్రాంట్ల రూపంలో నిధుల కేటాయింపులు ఉంటాయంటూ బీజేపీ నేతలు ఆశ చూపెట్టారు. కానీ ఒక్క రూపాయి కూడా రాష్ట్రం మొదలుపెట్టిన ప్రాజెక్టులకు నిధులివ్వలేదు. ఈసారి కూడా అర్బన్ గ్రాంట్ల పేరిట హైదరాబాద్ అభివృద్ధిని విస్మరించింది. ప్రకటించిన ప్రాజెక్టులకైన ప్రత్యేక కేటాయింపులు లేకున్నా.. అర్బన్ గ్రాంట్ల నుంచి నిధులు కేటాయిస్తామని స్పష్టం చేయలేదు. ఇక మౌలిక వసతుల కోసం రూ. 12.2లక్షల కోట్లు, లక్ష కోట్లు అర్బన్ అర్బన్ గ్రాంట్ల పేరిట హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కేటాయించింది. కానీ ఈ గ్రాంట్ల నుంచి నగరానికి నిధుల విడుదల అనుకున్న సులభం కాదనీ గతేడాది బడ్జెట్తోనే తేటతెల్లమైంది. ఇప్పుడు రాష్ట్ర సర్కారు చేతిలో ఉన్న వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను పట్టాలెక్కించడానికి కేంద్రం నిధులు అనివార్యంగా మారిన నేపథ్యంలో… గ్రాంట్ల నుంచి కేటాయింపులు జరిగితే గానీ నయా పైసా వచ్చే వీల్లేదు.
బడ్జెట్లో కేటాయింపుల్లేవు…
రాష్ర్టాల వారీగా కేంద్రం ఇచ్చే బడ్జెట్ కేటాయింపులను పక్కన పెడితే… రాష్ర్టాల చేపట్టే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కేంద్ర సహకారం, ఆర్థిక ప్రోత్సాహకాలను సర్దుబాటు చేస్తోంది. దీనికి అనుగుణంగానే ప్రతిపాదనలను కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ర్టాలు పంపుతుంటాయి. కానీ అందులో ఏ ఒక్క ప్రతిపాదన కూడా కేంద్ర పరిగణనలోకి రాలేదు. కనీసం హైదరాబాద్ అభివృద్ధిలో కీలకమైన మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు అనుమతులతోపాటు, నిధులు కేటాయింపులు ఉంటాయని ఆశించిన రాష్ట్ర సర్కారుకు భంగపాటు కలిగింది. ఇప్పటివరకు ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తామని హామీ ఇవ్వలేదు. ఇక లక్షన్నర కోట్లతో జీవనది మూసీ నదీని సుందరీకరణ చేస్తామంటూ రాష్ట్ర సర్కారు ఉత్సాహం చూపుతున్నారు. అసలు అంశమే కేంద్ర సర్కారు అజెండాలో లేని అంశంగా మారింది. దీంతో నగరాభివృద్ధికి కీలకమైన మెట్రో విస్తరణ కోసం కేంద్రం నుంచి ప్రోత్సాహం ఉంటుందనీ భావించారు. కానీ డీపీఆర్ పరిశీలన రెండేళ్లుగా సాగుతుందే తప్పా… బడ్జెట్ కేటాయింపులు మాత్రం శూన్యమేనని తేల్చింది.
దశాబ్ద కాలంగా మెట్రోకు మొండి చేతులే…
గడిచిన 12 ఏళ్ల కాలంగా హైదరాబాద్ అభివృద్ధికి కీలకమైన మెట్రో విస్తరణకు నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు అందుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి వెళ్లిన ఏ ఒక్క ప్రతిపాదనను కూడా కేంద్రం పట్టించుకోలేదు. కనీసం అడిగిన దానిలో సగం కూడా కేటాయించలేదు. దాదాపు రూ.45వేల కోట్లతో మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్రం నుంచి 18శాతం మేర నిధులను ఆశించిన రాష్ట్ర సర్కారుకు మొండి చేయి చూపించింది. ఫేజ్-2 నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు చేసినా, కేంద్రం నుంచి స్పందన లేదు. దీంతో దశాబ్ధ కాలంగా మెట్రో విస్తరణకు అవసరమైన నిధుల కేటాయింపుల్లో హైదరాబాద్ మెట్రోకు అన్యాయమే జరుగుతుంది.
కానీ చెన్నయ్, ఢిల్లీ మెట్రో విస్తరణ కోసం అడగకుండానే కేంద్రం నిధులను కేటాయిస్తోంది. ఎలాంటి ప్రతిపాదనలు లేకుండానే చెన్నయ్ మెట్రో విస్తరణ కోసం రూ. 40వేల కోట్ల ఆర్థిక సాయంతో చేయూతనిచ్చింది. ఇదీ మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 65శాతం మేర నిధులను కేంద్రమే తమిళనాడు సర్కారుకు కేటాయించింది. కానీ హైదరాబాద్ మెట్రో విషయంలో అనుకున్న తీరుగా నిధులను తీసుకురావడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. హైదరాబాద్ రెవెన్యూపై కేంద్రానికి ఉన్న ఆసక్తి, నిధులు కేటాయింపుల్లో లేదనీ ఇప్పటికే స్పష్టమైంది.
కనీసం గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న నగరాన్ని మరిన్ని పెట్టుబడులను ఆశించేందుకు అవసరమైన మౌలిక వసతులను కల్పించే ప్రాజెక్టులకైనా బడేభాయ్గా చెప్పుకునే మోదీ నిధులు కేటాయించలేదు. హైదరాబాద్ విషయంలో ఎక్కడ లేని ప్రేమను చూపించే మోదీ, బడ్జెట్ విషయంలో, కొత్త ప్రాజెక్టుల అనుమతుల విషయంలో ఎందుకు వివక్ష చూపుతున్నారనేది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నగానే ఉంది. కనీసం సర్కారు ప్రతిపాదనలను పట్టించుకోకున్నా… కేంద్రమైన నగరాభివృద్ధికి నిధులను కేటాయించాల్సింది. డిఫెన్స్, విమాన, ఫార్మా, ఐటీ కేంద్రంగా ఎదుగుతున్న నగరానికి కేంద్ర సర్కారు మొండి చేయి చూపుతుందనే విమర్శలు ఉన్నాయి.