బన్సీలాల్‌పేట్, జూలై 12: తెలంగాణాలో ఉన్న ఈఎస్ఐ దవాఖానాలు, డిస్పెన్సరీలలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని, రోగులకు కనీస సదుపాయాలు కూడా లేవని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ అన్నారు. న్యూ బోయిగూడలోని బీమా వైద్య సేవల శాఖ డైరెక్టరేట్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర వ్యాప్త ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈఎస్ఐ దవాఖానాలు, డిస్పెన్సరీలలో సరిపడా వైద్యులు లేరని, రోగులకు మందులు కూడా ఇవ్వడం లేదని అన్నారు. అధిక శాతం డిస్పెన్సరీలు అద్దె భవనాలలో కొనసాగుతున్నాయని, సకాలంలో అద్దె చెల్లించకపోవడంతో యజమానులు ఖాళీ చేయిస్తున్నారని తెలిపారు. ఎందుకు సొంత భవానాలను నిర్మించడం లేదని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ పరిధిలో మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు ఉన్నాయని తెలిపారు. సనత్‌నగర్ సూపర్ స్పెషాలిటీ దవాఖానకు వెళితే బెడ్స్ ఖాళీ లేవని, ప్రైవేట్ దవాఖానకు సిఫారసు చేస్తున్నారని పేర్కొన్నారు.
దాని వలన ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్నారు. అనేక డిస్పెన్సరీలలో మెడికల్ ఆఫీసర్లు లేకపోవడంతో ఫార్మాసిస్టులే మందులను ఇస్తున్నారని తెలిపారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని, పీఎఫ్, ఈఎస్ఐలను సరైన సమయంలో జమ చేయడం లేదని, కాంట్రాక్టర్ల గడువు ముగిసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జహీరాబాద్ పారిశ్రామికంగా విస్తరిస్తున్నదని, అక్కడ 50 పడకల దవాఖాన నిర్మించాలని, గద్వాలలో ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు చేయాలని, కాగజ్‌నగర్‌లో ఉన్న ఈఎస్ఐ దవాఖానను మెరుగుపరచాలని, నూతన భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన తెలిపారు. బీమా వైద్యసేవల శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.గౌతమ్‌ను కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈ ధర్నాలో నాయకులు కుమారస్వామి, రుద్రరాజు, మహేందర్, నర్సింగరావులతో పాటు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.