కాచిగూడ,ఏప్రిల్ 1: అపరిచిత వ్యక్తులు ఆర్థిక పరమైన లావాదేవీల వివరాలు ఫోన్లో అడిగితే ఎట్టి పరిస్థితుల్లో స్పందించవద్దని కాచిగూడ ఇన్స్పెక్టర్ ఎస్.రాజశేఖర్ సూచించారు. కాచిగూడ బస్ డిపొ మేనేజర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సైబర్ నేరగాళ్ల పట్ల ఆర్టీసీ సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని బుధవారం కాచిగూడ బస్ టెర్మినల్‌లో నిర్వహించారు. ముఖ్యఅతిధిగా కాచిగూడ సీఐ హాజరై మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు కొత్త తరహ నేరాలకు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
మోసపూరితమైన యాప్‌లను నమ్మవద్దని, ఉద్యోగం కోసం గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులు చెల్లించాలని అడిగితే అది మోసపూరితమైందని గుర్తించాలని సూచించారు. ఈజీగా డబ్బులు వస్తాయంటే ఎవరు నమ్మవద్దని, లాటరీ గెలిచారని, బహుమతులు వచ్చాయని వచ్చే మెసేజ్‌లు, ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని పేర్కొన్నారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసిన.. మేసేజ్‌లు పంపినా 8712660540లో సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ భరత్‌కుమార్, పావని, వాసవి, అయోధ్య రాములు, తదితరులు పాల్గొన్నారు.