సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): నగరంలో సంచలనం సృష్టించిన స్పందన హత్య కేసు మిస్టరీని ఎట్టకేలకు మియాపూర్ పోలీసులు ఛేదించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు మొదట భర్తను అనుమానించినప్పటికీ దర్యాప్తులో భాగంగా లభించిన సాక్ష్యాధారాలతో అసలు దోషిని గుర్తించి అరెస్టు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. శేరిలింగంపల్లి, మజీద్ బండకు చెందిన మనోజ్‌కుమార్ అలియాస్ బాలు(29), బండి స్పందన, వారణాసి వినయ్ ఈ ముగ్గురూ క్లాస్మేట్స్. మనోజ్‌కుమార్ చురుకుగా ఉండే స్పందనపై ఇష్టం పెంచుకున్నాడు. కానీ, 2022లో వారణాసి వినయ్‌తో స్పందనకు వివాహమైంది. దీంతో మనోజ్ తన ప్రేమను మనస్సులోనే దాచుకున్నాడు. మనస్పర్దలతో ఏర్పడిన కుటుంబ తగాదాల కారణంగా స్పందన తన భర్తతో దూరంగా ఉంటోంది.
భార్యాభర్తలిద్దరూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. వీరి విడాకులు పెండింగ్‌లో ఉండటంతో స్పందన తన తల్లితో కలిసి మియాపూర్‌లోని సీబీఆర్ ఎస్టేట్‌లో నివాసం ఉంటోంది. భర్తతో దూరంగా ఉంటున్న స్పందనపై మనోజ్ మరోసారి ప్రేమ పెంచుకున్నాడు. ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేస్తుండటంతో ఈసారి ఎలాగైనా స్పందనను దక్కించుకోవాలని, తన ప్రేమ విషయాన్ని స్పందనకు తెలిపాడు. కానీ, ఆమె మనోజ్ ప్రేమను నిరాకరించింది. ఒక స్నేహితుడిగానే మనోజ్‌తో మెలుగుతోంది. అదే సమయంలో తోటి ఉద్యోగులు, క్లాస్‌మేట్స్‌తో దగ్గరగా మెలుగుతోంది.
ఇది నచ్చని మనోజ్ పలు మార్లు స్పందనను వారించాడు. అతడి మాటలను స్పందన లెక్కచేయలేదు. దీంతో స్పందనను ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకుని సరైన సమయం కోసం ఎదురుచూశాడు మనోజ్. ఈ క్రమంలోనే గత నెల 30న స్పందన ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని మనోజ్ గమనించాడు. స్పందన ఇంట్లోకి చొరబడి ఆమె ముఖంపై గ్రానైట్ రాయితో మోది, స్క్రూడైవర్‌తో పొడిచి విచక్షణా రహితంగా హత్యచేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ, సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ తదితర ఆధారాలతో మనోజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా స్పందనను హత్యచేసినట్లు అంగీకరించాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.