సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): పుట్టిన ఒకటి రెండు రోజుల్లోనే ఆగ, మగ తేడా లేకుండా పసి కందులను హైదరాబాద్‌కు తెచ్చి విక్రయిస్తున్న ముఠాను రాచకొండ మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్ముతున్న వారితో పాటు పిల్లలను కొనుగోలు చేసిన వారు అరెస్టయిన వారిలో ఉన్నారు. మంగళవారం పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. కుత్బుల్లాపూర్‌కు చెందిన కోల కృష్ణవేణి సోషల్‌మీడియాలో చిన్న పిల్లలను దత్తత తీసుకోవడానికి విక్రయించే వారి గురించి సోషల్‌మీడియాలో శోధించడంతో ఢిల్లీకి చెందిన మనోజ్ అనే వ్యక్తి 2024లో పరిచయమయ్యాడు. అతడి ద్వారా మగశిశువును రూ. 5లక్షలకు కొనుగోలు చేసింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు మనోజ్ ముఠా ఆ పసికందును తీసుకొచ్చి విక్రయిస్తుండగా గోపాలపురం పోలీసులు పట్టుకొని కృష్ణవేణిని అరెస్ట్ చేశారు.
రైల్లో తీసుకొచ్చి..
గోపాలపురం కేసులో జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత అప్పటికే కృష్ణవేణితో పరిచయం ఉన్న కొత్తపేటకు చెందిన బట్టు దీప్తి, సికింద్రాబాద్‌కు చెందిన సంపత్‌కుమార్‌లు పిల్లలను విక్రయిస్తే మంచి సంపాదన ఉంటుందంటూ సూచించారు. దీంతో కృష్ణవేణి మరోసారి సోషల్‌మీడియాలో శోధించడంతో గుజరాత్ అహ్మదాబాద్‌కు చెందిన వందన అనే ఒక మహిళ పరిచయమైంది. తాను గుజరాత్ నుంచి పసిపిల్లలను తన మనిషులతో పంపిస్తానని, వాళ్లు తెచ్చిమీకు అప్పగిస్తారని, ఆడ బిడ్డకు రూ. 1.5 లక్షలు, మగ బిడ్డకు రూ. 2.5 లక్షలు తనకు ఇవ్వాలంటూ ఒప్పందం చేసుకున్నారు. దీంతో కృష్ణవేణి టీమ్ మరోసారి ఈ అక్రమ దందాను ప్రారంభించింది.
అహ్మదాబాద్‌కు చెందిన సునీత సుమన్, సావిత్రి దేవి అక్కడి నుంచి పసి పిల్లలను రైల్లో తీసుకొచ్చి మీకు అప్పగిస్తారని చెప్పారు. దీంతో ఈ ఏడాది జనవరి 28 నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకు ఇద్దరు ఆడ, ఇద్దరు మగ పసి పిల్లలను వందన పంపించింది. ఈ పసి కందులను కృష్ణవేణి తన గ్యాంగ్ సభ్యులైన దీప్తి, సంపత్‌కుమార్‌లతో కలిసి ఏపీ, తెలంగాణలో నలుగురు పసికందులను విక్రయించారు. ఇందులో శారద, ఉమారాణి, జయశ్రీ, శ్రాణ్, సోని, కీర్తిలు మధ్యవర్తులుగా వ్యవహరించి ఆడ బిడ్డను రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలు, మగ శిశువును రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పిల్లలు కావాల్సిన వారికి విక్రయించారు.
చైతన్యపురిలో పట్టుబడ్డ గ్యాంగ్..
పసి పిల్లలను విక్రయిస్తున్నారని మల్కాజిగిరి ఎస్ఓటీ డీసీపీ రమణారెడ్డి, అదనపు డీసీపీ నంద్యాల నర్సింహారెడ్డి, ఇన్స్పెక్టర్ జానయ్యలకు విశ్వసనీయ సమాచారం అందడంతో చైతన్యపురి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల బృందంతో కలిసి మంగళవారం చైతన్యపురి బస్‌స్టాప్ వద్ద సీడబ్ల్యూసీ(చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ) సభ్యులతో కలిసి అక్కడకు వెళ్లారు. కోల కృష్ణవేణి, అహ్మదాబాద్‌కు చెందిన సావిత్రిదేవి, గాంధీ దవాఖానలో ఔట్‌సోర్సింగ్‌లో వార్డు బాయ్‌గా పనిచేస్తున్న సంపత్‌కుమార్‌లు మగశిశువుతో అనుమానాస్పదంగా పట్టుబడ్డారు. ఈ ముగ్గురిని విచారించడంతో మరో ముగ్గురు పసిబిడ్డలను కూడా నెల రోజుల వ్యవధిలో విక్రయించినట్లు వెల్లడించారు.
దీంతో ఆ పసిబిడ్డలకు సంబంధించిన వివరాలు సేకరించి నలుగురు పసి బిడ్డలను గుర్తించి వారిని సీడబ్ల్యూసీకి అప్పగించారు. కృష్ణవేణి, సావిత్రిదేవి, సంపత్‌కుమార్‌లు ఈ ముఠాకు చెందిన బట్టు దీప్తి, శ్రాణ్‌కుమార్, అంగోత్ శారదలతో పాటు పిల్లలను కొనుగోలు చేసిన విజయవాడకు చెందిన ఎన్ఆర్ఐ ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫిసర్గా పనిచేస్తున్న నాగ వెంకట పవన్ భగవాన్ ఆయన భార్య రమా శ్రావణి, ఇంటర్నెట్ కనెక్షన్ ఆపరేటర్ సైదాబాద్ కాలనీకి చెందిన తెప్పల వినయ్‌కుమార్, ఆయన భార్య స్వాతి, మహబుబాబాద్ జిల్లా, కేసముద్రానికి చెందిన లింగాల రమేశ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
చట్టప్రకారం దత్తత తీసుకోవాలి
అహ్మదాబాద్ నుంచి పుట్టిన ఒకటి రెండు రోజుల్లోనే పిల్లలను తీసుకొని ట్రైన్లో హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారని సీపీ సుధీర్‌బాబు తెలిపారు. పిల్లలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను కూడా ఈ ముఠా తయారు చేస్తోందన్నారు. చట్టప్రకారం పిల్లలను దత్తత తీసుకోవాలని సూచించారు. అలాకాకుండా అక్రమ మార్గంలో పిల్లలను కొనుగోలు చేస్తే చట్టవిరుద్ధమని, కొనుగోలు చేసిన వారు కూడా నేరస్తులే అవుతారని చెప్పారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి వందన కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.