సైదాబాద్, నవంబర్ 21: ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు సైదాబాద్‌లోని బాలుర పరిశీలక సదనం, బాలుర సదనాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు ముగిశాయి. ముగింపు వేడుకల్లో భాగంగా బాలుర ప్రత్యేక సదనంలో జరిగిన కార్యక్రమానికి జువైనల్ జస్టిస్ బోర్డు (జేజేబీ) రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ ఉషాశ్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చట్టంలో చిన్నారులకు అందరిలాగే హక్కులు ఉన్నాయని, వాటి పరిరక్షణకు ప్రజలందరి బాధ్యత ఉందన్నారు. వారం రోజులపాటు వివిధ అంశాల్లో చిన్నారులకు తమ హక్కులపై అవగాహన కల్పించామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని, దుర్వినియోగం చేసుకోవద్దని సూచించారు. వివిధ అంశాల్లో ప్రతిభ కనబర్చిన చిన్నారులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జేజేబీ రంగారెడ్డి జిల్లా సభ్యుడు వాసు, బాలుర పరిశీలక సదనం సూపరింటెండెంట్ సయ్యద్ అఫ్జల్ షావలీ తదితరులు పాల్గొన్నారు.