బడంగ్‌పేట, నవంబర్ 25: తల్లి కండ్ల ముందే కన్న కూతురు కన్ను మూసింది. ఆడుకుంటున్న బిడ్డ కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి చెందిన ఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వనపురి కాలనీ భూపేశ్ గుప్తా నగర్‌కు చెందిన తిరుమల బాల వెంకమ్మ, చిన్న తిరుపతయ్య దంపతుల కూతురు బాలమ్మ(2) ఇంటి ముందు పిల్లలతో కలిసి ఆడుకుంటున్నది.
అదే సమయంలో మారుతి షిప్ట్ (ఏపీ 20ఏఆర్ 6311) డ్రైవర్ కారును అతి వేగంగా నడిపి చిన్నారిని ఢీకొట్టాడు. దీంతో చిన్నారి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. కారుతో చిన్నారిని ఢీకొట్టి పారిపోతున్న డ్రైవర్‌ను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు.