బంజారాహిల్స్.అక్టోబర్ 29: పదేండ్ల పాటు పేదల కోసం పనిచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలంటే నెలరోజల పాటు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు. జూబ్లీహిల్స్ డివిజన్‌కు చెందిన బూత్ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ ముఖ్యనాయకుల సమావేశం ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించారు. పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచార బాధ్యతలను కార్యకర్తలకు అప్పగించడంతో పాటు పర్యవేక్షణ బాధ్యతలను ఇతర నాయకులకు అప్పగించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఒకవైపు ప్రభుత్వం చేసిన అభివృద్ధి కళ్లముందే కనపడుతుందని, రెండోవైపు దేశంలో ఎక్కడా లేని విధంగా 65 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందన్నారు. అయితే కేవలం ఎన్నికల్లో ప్రయోజనం పొందడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అంటూ వచ్చి హడావుడి చేస్తున్నారన్నారు. చేసిన మంచిపనులు చెప్పుకుని బీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడుగుతుంటే కళ్లబొల్లి మాటలు చెబుతూ కాంగ్రెస్ పార్టీ, మతం పేరు చెప్పుకుని బీజేపీ ఓట్లు అడుగుతున్నాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. రానున్న నెలరోజులు బూత్‌స్థాయిలో కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని రకాలైన పథకాలు అమలు చేస్తున్నారనే విషయాన్ని గురించి వివరించాలని సూచించారు. పదేళ్ల పాటు ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం ఒకవైపు ఉండగా రానున్న నెలరోజుల్లో కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఓటర్లను కలిసి చేసే ప్రచారం రెండోవైపు ఉంటుందన్నారు. చిన్నచిన్న సమస్యలు వచ్చినా సర్దుకుపోయి భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్, బీఆర్ఎస్ నాయకులు మామిడి నర్సంగరావు, డివిజన్ ఎన్నికల ఇన్చార్జి బండ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.