ఉస్మానియా యూనివర్సిటీ: సమానత్వ సాధనే బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ లక్ష్యమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అన్నారు. రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ పాత్ర చాలా విలువైందని కొనియాడారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన ‘కానిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా: ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్’ అనే అంశానికి సంబంధించి నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీజేఐ జస్టిస్ గవాయ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే నేరుగా భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని రాజ్యాంగంలోని 32వ ఆర్టికల్‌లో పేర్కొన్నారని గుర్తుచేశారు. ఒకే దేశం- ఒకే రాజ్యాంగం ఉండాలని అంబేద్కర్ గట్టిగా నమ్మారని చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. అనంతరం పోస్టల్ విభాగం ఆధ్వర్యంలో ‘బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ – కానిస్టిట్యుయెంట్ అసెంబ్లీ – కానిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా’ పై ముద్రించిన ప్రత్యేక కవర్, ‘ఆర్ట్ అండ్ కాలిగ్రఫీ ఇన్ ద కానిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా’ పై రూపొందించిన పోస్ట్‌కార్డ్ చిత్రాలను అతిథులు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నర్సింహ, తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఓయూ అధికారులు పాల్గొన్నారు.