మన్సురాబాద్, మే 18 : జీవనోపాధి కరువై నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం అదేమీ పట్టించుకోకుండా అందాల పోటీలలో మునిగితేలుతుందని మాజీ ఎమ్మెల్సీ, చేనేత కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు చెరుపల్లి సీతారాములు విమర్శించారు. మనసురాబాద్ డివిజన్ పరిధి సహరాస్టేట్స్ కాలనీలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర కార్మిక సంఘం సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో చేనేత కార్మికులు పొద్దంతా పనిచేసిన పూట గడవక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఆదుకోక పోగా కోట్లు ఖర్చుచేసి రాష్ట్రంలో అందాల పోటీలు నిర్వహించటం ఏమిటని ప్రశ్నించారు.
చేనేత రుణాలు మాఫీచేస్తామని, నూలుపై సబ్సిడీ ఇస్తామని ప్రకటించి ఏడాది గడుస్తున్నా ఇప్పటికి అమలు కావడంలేదని అన్నారు. నూలుపై సబ్సిడీ వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేసి రుణ మాఫీ అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. 2024 ఆగస్టులో త్రిఫ్ట్ పథకం గడువు ముగిసినా ఇప్పటి వరకు త్రిఫ్ట్ పథకాన్ని పునరుద్ధరించలేదని తెలిపారు. జియో టాగ్ ఉన్న నేత కార్మికునితోపాటు ఇద్దరికి అనుబంధ కార్మికులకు కూడ త్రిప్ట్ పథకం వర్తింప చెయ్యాలని డిమాండ్ చేసారు.
చేనేత వస్త్రాలు టెస్కో ద్వారా కొనుగోలు చేయడంతో పాటు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున అందోళన కార్యక్రమం చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్, బడుగు శంకరయ్య, గుండు వెంకటనర్సు, గుర్రం నర్సింహా, సామలేటి రాజేందర్, చెన్న రాజేష్, చిదిరాల నారాయణ, పెంటయ్య, శేఖరయ్య, గజం శ్రీశైలం, గంజి రామచంద్రం పాల్గొన్నారు.