సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ)/అబిడ్స్: ఆస్తమా వ్యాధిగ్రస్తులకు నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈనెల 8, 9న చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈమేరకు వేలాది మంది వచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వివిధ రూట్ల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు టీజీఆర్టీసీ శుక్రవారం ప్రకటించింది. ముఖ్యమైన బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టు నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు బస్సులను 8వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.
వాటిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, చర్లపల్లి రైల్వేస్టేషన్‌తో పాటు జేబీఎస్, ఎంజీబీఎస్, ఈసీఎఐఎల్ ఎక్స్ రోడ్స్, శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వివిధ బస్ డిపోల నుంచి బస్సులను నడుపుతామని చెప్పారు. ఆయా రూట్లలో మొత్తం 60 బస్సులను అదనంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా ముఖ్యమైన ప్రాంతాల నుంచి మరో 80 బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. కాగా, ఈ ఏడాది ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ కోసం 42 క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తెలిపారు.