Cardiac Arrest | అమీర్‌పేట్ : సడన్ కార్డియాక్ అరెస్టులు మనిషిని ఉన్నచోటే కుప్పకూల్చేస్తాయని అమీర్‌పేట్‌లోని ఆస్టర్ ప్రైమ్ ఆసుపత్రి కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ సాయి రవిశంకర్ అన్నారు. బుధవారం ఆస్టర్ ప్రైమ్ ఆసుపత్రిలో సడన్ కార్డియాక్ అరెస్టులపై హృద్రోగులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన దేశంలో ప్రతి ఏటా దాదాపు 7 లక్షల మరణాలు సడన్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా సంభవిస్తున్నాయన్నారు. ఇటీవలే మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఓ కుటుంబం కార్డియాక్ అరెస్టుల అంశాన్ని సదస్సులో ఉదహరించారు. అక్కడ ఓ శుభకార్యంలో పాల్గొన్న 23 ఏళ్ల యువతి డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్ప కూలింది. యువతితోపాటు అక్కడే డాన్స్ చేస్తున్న వారిలో వైద్యులు కూడా ఉండడంతో వెంటనే వారు స్పందించి ఆ యువతీకి సిపిఆర్ విధానం ద్వారా కృత్రిమ శ్వాసను అందించేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది.
ఆ సందర్భంగా యువతి కుటుంబ చరిత్రను పరిశీలించగా తన సోదరుడు 12 ఏళ్ల వయసులో ఇదే తరహాలో సడన్ కార్డియాక్ అరెస్టుకు గురై కుప్పకూలిన విషయాన్ని సదస్సులో డాక్టర్ సాయి రవిశంకర్ ప్రధానంగా ప్రస్తావించారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన (రక్త సంబంధీకులు) వారు సడన్ కార్డియాక్ అరెస్టులకు గురైన కుటుంబ చరిత్ర ఉంటే, ఆ కుటుంబ సభ్యులు తప్పనిసరిగా గుండె వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిదని, ఈ తరహాలో గుండె సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య హైపర్ట్రోఫిక్ అబ్స్ ట్రక్టివ్ కార్డియో మయోపతి (హెచ్ ఓ సి ఎం) అని తెలిపారు.
ఈ తరహా గుండె ఇబ్బందులు ఉన్నవారు కఠినమైన వ్యాయామాలు, డ్యాన్సులు, ఫుట్ బాల్ వంటి క్రీడలకు దూరంగా ఉండాలని, శారీరక శ్రమలు ఎక్కువగా ఉండే ఏ పనులు వీరు చేయకూడదని, ముఖ్యంగా గుండె సమస్యల కుటుంబ చరిత్ర ఉన్నవారు క్రమం తప్పకుండా ప్రతి ఏటా గుండె వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల సడన్ కార్డియాక్ అరెస్టులను చాలావరకు తప్పించే వీలుందన్నారు.
కొన్ని సందర్భాల్లో గుండె సమస్యల కుటుంబ చరిత్ర లేకపోయినా మధుమేహం, అధిక రక్తపోటు, పొగత్రాగడం, మద్యం, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో కూడా సడన్ కార్డియాక్ అరెస్టులు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ఈ తరహా హఠాన్మరణాలను తప్పించుకునే అవకాశం మన చేతుల్లోనే ఉందని, క్రమం తప్పకుండా గుండె వైద్య పరీక్షలు, మెరుగైన జీవనశైలితో చాలావరకు ఈ ప్రమాదాలను తప్పించే వీలుందన్నారు.
Hyderabad | మూసీ పరిసరాల్లో మళ్లీ కూల్చివేతలు.. భయాందోళనలో జనం
Mythological Drama Competitions | పౌరాణిక నాటక పోటీలకు బ్రోచర్ ఆవిష్కరణ