జూబ్లీహిల్స్, జూన్ 29 : కాలనీ వాసుల సామూహిక అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని కాజేసేందుకు యత్నించిన వారి నుంచి సదరు స్థలానికి హైడ్రా అధికారులు విముక్తి కల్పించిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ సర్కిల్ ఎల్లారెడ్డిగూడలో సాయి సారథి నగర్ కాలనీ వాసుల దశాబ్దాల పోరాటంతో ఎట్టకేలకు కోట్లాది రూపాయల స్థలం కబ్జా చెర వీడింది. మధురా నగర్ మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలోని ఎల్లారెడ్డి గూడలో 1961లో 5 ఎకరాల విస్తీర్ణంలో 35 ప్లాట్ల లేఔట్తో సాయి సారధి నగర్ ఏర్పాటైంది. ఈ లేఔట్లో 6 రోడ్లను అభివృద్ధి చేసి.. పార్కు స్థలాన్ని మాత్రం అలాగే వదిలేశారు.
కాగా కాలనీలో పార్కు స్థలంగా చూపిన 1533 గజాల స్థలాన్ని స్థానికంగా నారాయణ ప్రసాద్ వారసులు షెడ్లు వేసి తమ ఆధీనంలో ఉంచుకోవడంతో పాటు అక్రమంగా ఇంటి నెంబర్లు సైతం తెచ్చుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సాయి సారథి నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రాను ఆశ్రయించి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు సమస్య పరిష్కారం అయింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో వివిధ శాఖల సమన్వయంతో విచారణ చేపట్టిన అధికారులు దశాబ్దాలుగా ఇక్కడ పాతుకుపోయిన నిర్మాణాలను, షెడ్లను తొలగించారు. కబ్జా చెర నుంచి విముక్తి పొందిన పార్కు స్థలంలో ప్రొటెక్టెడ్ బై హైడ్రా బోర్డు పెట్టడంతో దశాబ్దాల కబ్జా కథ సుఖాంతం అయింది.