సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా ఇద్దరు బాధితులను కాపాడిన ఐసీఐసీఐ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ సలేహా బేగం, సీసీఎస్ సైబర్ క్రైం హెడ్ కానిస్టేబుల్ ఫిరోజ్‌ను శుక్రవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో అభినందించారు. రెండు నేరాలకు సంబంధించి రూ.19.5 లక్షలు సైబర్‌నేరగాళ్ల చేతికి వెళ్లకుండా వారిద్దరూ కాపాడారు.
వారాసిగూడ నివాసి శ్రీనివాస్ ట్రేడింగ్ ఫ్రాడ్‌లో చిక్కుకొని.. నల్లకుంటలోని ఐసీఐసీఐ బ్యాంకులో రూ. 9 లక్షలు డిపాజిట్ చేయడంతో డిప్యూటీ మేనేజర్‌కు అనుమానం వచ్చింది. వెంటనే సైబర్‌క్రైమ్ హెడ్‌కానిస్టేబుల్ ఫిరోజ్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన బాధితుడితో మాట్లాడాడు. బాధితుడు ఇది వరకే రూ. 3 లక్షలు డిపాజిట్ చేసినట్లు తెలిపాడు. వెంటనే సైబర్‌క్రైమ్‌లో ఫిర్యాదు చేయాలని, మిగతా సొమ్మును డిపాజిట్ చేయవద్దంటూ అవగాహన కల్పించారు.
అడిక్మెట్కు చెందిన నవీన్‌కుమార్ డిజిటల్ అరెస్ట్ మోసంలో చిక్కుకున్నాడు. ఐసీఐసీఐ బ్యాంకులో రూ. 11.50 లక్షలు డిపాజిట్ చేసేందుకు వచ్చాడు. అతడిని గమనించిన డిప్యూటీ మేనేజర్.. అతడితో మాట్లాడింది. భయంతో ఉన్నట్లు గుర్తించి వెంటనే హెడ్‌కానిస్టేబుల్‌కు సమాచారమిచ్చింది. వెంటనే హెడ్ కానిస్టేబుల్ ఫిరోజ్ బాధితుడితో మాట్లాడాడు. ‘సార్ మేం హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులం., మిమ్మల్ని మనీలాండరింగ్ జరిగిందంటూ బ్లాక్మెయిల్ చేస్తున్న వాళ్లంతా నకిలీ పోలీసులు.. భయపడకండి.. మేము మీ వెంట ఉన్నాం.. మీరు మాత్రం బ్యాంకు ఖాతాలలో డబ్బులు డిపాజిట్ చేయవద్దు’.. అంటూ కౌన్సెలింగ్ ఇవ్వడంతో బాధితుడు తేరుకొని సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.