బంజారాహిల్స్, మే 28: స్థలం విక్రయం పేరుతో విశ్రాంత ఎస్ఐని నమ్మించి మోసం చేసిన రియల్ ఎస్టేట్ సంస్థ ఎండీతో సహా నలుగురిపై ఫిలింనగర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నేరేడ్మెట్లోని ఈస్ట్ కాకతీయ నగర్లో నివాసముంటున్న ఈడిగ శ్రీశైలం పోలీసు శాఖలో ఎస్ఐగా పనిచేసి ఇటీవలే ఉద్యోగ విరమణ పొందాడు. ఏడాది కిందట అతడికి ఫిలింనగర్‌లోని త్రివిష్ట వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మార్కెంటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్న నాగరాజు పరిచయమయ్యాడు. సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాల్ గ్రామ శివారులో ఉన్న స్థలం కొనుగోలు చేస్తే మంచి లాభం వస్తుందని నమ్మబలికాడు. అతడి మాటలు నమ్మిన శ్రీశైలం తన భార్య లక్ష్మి పేరుతో త్రివిష్ట వెంచర్స్ సంస్థ నుంచి రూ.22 లక్షల ధరకు మూడు గుంటల భూమి కొనేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ.10 లక్షలు చెల్లించాడు.
మూడు నెలల్లో రిజిస్ట్రేషన్ చేస్తామని సంస్థ చైర్మన్ సీతారాం, మార్కెటింగ్ మేనేజర్ నాగరాజు, బాబ్జీ తదితరులు నమ్మించారు. అయితే, అనుకున్న సమయానికి రిజిస్టర్ చేయకపోగా.. వివిధ కారణాలు చెబుతూ కాలయాపన చేశారు. దీంతో ఫిలింనగర్‌లోని ఆఫీసుకు వెళ్లగా.. ఫేజ్ -1లోని స్థలానికి బదులుగా ఫేజ్-2లో ఉన్న స్థలం రిజిస్టర్ చేయిస్తామని నమ్మబలికారు. దీంతో మరో రూ.10లక్షలు చెల్లించారు. అయితే, రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్లగా.. సంస్థ నుంచి ఎవరూ రాకపోవడంతో ఇటీవల మరోసారి ఆఫీసుకు వెళ్లి ప్రశ్నించగా.. తీసుకున్న రూ.20 లక్షలు తిరిగి ఇస్తామని చెప్పి చెక్కులు ఇచ్చారు. ఆ చెక్కులు బ్యాంకులో డిపాజిట్ చేయగా.. బౌన్స్ అయ్యాయి. ఉద్దేశపూర్వకంగానే మోసం చేసిన సంస్థ చైర్మన్ సీతారాంతో పాటు ఇతరులపై చర్యలు తీసుకోవాలని శ్రీశైలం మంగళవారం ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఐపీసీ 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.