ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 18: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉత్త చేతులతో ఉస్మానియా యూనివర్సిటీకి రావొద్దని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా క్యాంపస్‌కు వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన హాస్టల్ భవనాలను ప్రారంభించి, తమ ఖాతాలో వేసుకునేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఓయూలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బీఆర్ఎస్వీ నాయకులను విలేకరుల సమావేశం పెట్టకుండా అడ్డుకున్న పోలీసులు.. అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా దశరథ్ మాట్లాడుతూ పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. భావప్రకటనా స్వేచ్ఛను హరించడం సరికాదన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఇలాంటి నిర్బంధం లేదని గుర్తు చేశారు. పోలీసులు ఇప్పటికే ఓయూలో సూడో వీసీగా వ్యవహరిస్తూ, వర్సిటీలో ఏం చేయాలో, ఏం చేయకూడదో విలేకరుల సమావేశాలు నిర్వహించి మరీ చెబుతుండగా.. యూనివర్సిటీ అధికారులు ఖండించకపోవడం దారుణమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ తాబేదారులుగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులకు గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టే మొదటి బడ్జెట్లోనే అన్ని వర్సిటీలకు ప్రత్యేక నిధులు కేటాయించి, అభివృద్ధి చేస్తామని చెప్పినప్పటికీ, గద్దెనెక్కిన తరువాత ఆ ఊసే మరిచిపోయారని దుయ్యబట్టారు. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తామని ఘనంగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం..ఎన్ని పోస్టులను భర్తీ చేసిందో వివరాలు వెల్లడించాలని సవాల్ విసిరారు. వర్సిటీల్లో పరిశోధక విద్యార్థులకు నెలకు రూ.1 0 వేల ఫెలోషిప్, పార్ట్ టైం లెక్చరర్లకు రూ. 50వేల గౌరవ వేతనం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఇంకా మెరుగైన రీతిలో కొనసాగిస్తామని చెప్పి, ఆ పథకాన్ని మరుగునపడేలా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.8,145 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఓయూ పరిధిలోని వివిధ కళాశాలలకు పెండింగ్‌లో ఉన్న రూ. 83.15 కోట్ల మెస్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని ధ్వజమెత్తారు. విద్యార్థులకు ఇస్తానన్న రూ. 5 లక్షల విద్యాభరోసా కార్డు, రూ. 4 వేల నిరుద్యోగ భృతి సంగతి తేల్చాలని సూచించారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఏడాది గడుస్తున్నా, నేటికీ నియామకాల ఊసేలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రకటన చేసి ఓయూకు రావాలని హితవు పలికారు. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసి, ఉద్యోగ పరీక్షలు నిర్వహించిన వాటికి ఆర్డర్ కాపీలు అందజేసి తాము ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రకటించుకుంటున్న ప్రభుత్వ పెద్దలు.. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 80 కోట్లతో నిర్మించిన భవనాల ప్రారంభానికి వచ్చి.. దీనిని కూడా తమ ఖాతాలో వేసుకుందామని కుటిల యత్నాలకు తెరతీస్తున్నారంటూ ఆరోపించారు.
రేవంత్‌రెడ్డి 20 నెలల పాలనలో సంక్షేమ హాస్టళ్లు, డిగ్రీ కళాశాలలు, మెడికల్ కళాశాలలకు తాళాలు పడ్డాయని విమర్శించారు. గురుకులాల పరిస్థితి మరీ దయనీయంగా మారిందన్నారు. కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థలో తీసుకువచ్చిన అతి పెద్ద మార్పు ఇదేనని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేసిన తరువాతే ఓయూకు రావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రేవంత్‌రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. బీఆర్ఎస్వీ నాయకులు జంగయ్య, నాగారం ప్రశాంత్, శ్రీను నాయక్, శ్రీకాంత్, నాగేందర్రావు, అవినాశ్, సాయిగౌడ్, పవన్ పాల్గొన్నారు.