Bhagya Lakshmi Temple | చార్మినార్, ఫిబ్రవరి 26 | చారిత్రక చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయ నిర్వహణ బాధ్యతలను ఇకపై దేవాదాయశాఖ చూసుకోనున్నది. ప్రస్తుతం ఆలయ పర్యవేక్షణ బాధ్యత ట్రస్టీల పరిధిలో ఉండగా.. దేవాయదాయశాఖ పరిధిలో కొనసాగించాలని ట్రిబ్యునల్ గురువారం తీర్పును వెలువరించింది. ప్రస్తుతం భాగ్యలక్ష్మీ ఆలయ నిర్వహణ బాధ్యతలను మహంత్ మనోహర్ దాస్, మహంత్ రాంచంద్రదాసు 1960 దశకం నుంచి చూసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఆలయానికి ఈవోను నియమించి.. ఎలాంటి అవకతవకలు లేకుండా ముందుకు వెళ్లాలని దేవాదాయశాఖ కమిషనర్ ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ ఆలయ ఆదాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు కోర్టు విచారణ జరిపి.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
1967లో చార్మినార్ స్థానిక భక్తులు విరాళాలు సేకరించి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసే మహంత్ రాంచంద్రదాసు, రాజ్ మోహన్ దాసు అనే వ్యక్తిని పూజారిగా నియమించారు. టెంపుల్ ట్రస్టీ మీద గతంలో ఉన్న సుప్రీంకోర్టు తీర్పు కారణంగా హెరిడెటరీ ట్రస్టీ ఆర్డర్స్‌తో ఆలయాన్ని ఆధీనంలోకి తీసుకొని ఆదాయాన్ని రాజ్ మోహన్‌దాస్ ఒక్కరే అనుభవిస్తూ వచ్చారు. రాంచంద్ర దాసు కుమార్తె భాగ్యలక్ష్మీ ఆలయం అజామాయిషీ చేస్తున్న వారిపై కోర్టును ఆశ్రయించారు. కోట్లాది రూపాయాల ఆలయ నిధులను ప్రస్తుత నిర్వహకులు దుర్వినియోగం చేస్తున్నట్లుగా సాక్ష్యాధారాలను కూడా ట్రిబ్యూనల్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆలయాన్ని దేవాదాయ శాఖకు అప్పగించాలని తీర్పు ఇచ్చినట్లు దేవాదాయశాఖ వర్గాల అధికారులు తెలిపాయి.