కొండాపూర్, ఫిబ్రవరి 9: గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరిని చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 4.1 కిలోలు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగండ్ల చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఓ ఆటోలో వెళ్తున్న ఇద్దరు ప్రయాణికులు పోలీసులను చూసి బ్యాగులతో పారిపోసాగారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు.
విచారణలో వారి పేర్లు బాదల్ రౌత్ (24), విష్ణువర్ధన్‌రెడ్డి (19) చెప్పారు. నిందితులిద్దర్ని అదుపులోకి తీసుకుని విచారించగా, గంజాయి సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. వీరికి విశ్వ అనే వ్యక్తి గంజాయి సరఫరా చేశాడని, అతడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులిద్దర్ని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గోపీనగర్ నివాసి ఆనంద్(42) ఇంట్లో గంజాయి చెట్టు పెంచుతున్నట్లు సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అక్కడికి వెళ్లి.. చెట్టుతో పాటు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు అరకిలో బరువున్న గంజాయి సీజ్ చేసి, ఆనంద్‌ను రిమాండ్‌కు తరలించినట్లు చందానగర్ పోలీసులు తెలిపారు. ఈ రెండు వేర్వేరు కేసుల్లో రూ.2.25 లక్షల విలువజేసే గంజాయి సీజ్ చేసినట్లు తెలిపారు.