శేరిలింగంపల్లి, ఆగస్టు 16: ఖజానా జువెల్లర్స్ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఎట్టకేలకు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన మరో ఐదుగురి కోసం వేట కొనసాగిస్తున్నారు. పట్టుబడిన నిందితుల వద్ద నుంచి 900 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శనివారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో డీసీపీ డాక్టర్ వినీత్ వివరాలు వెల్లడించారు. ఈనెల 12న ఉదయం వేళ కొందరు గుర్తు తెలియని దుండగులు ముఖాలకు ముసుగులు ధరించి, తుపాకులతో చందానగర్ ఠాణా పరిధిలోని ఖజానా జ్యువెల్లర్స్ దుకాణంలోకి చొరబడ్డారు.
డిప్యూటీ మేనేజర్‌పై కాల్పులు జరిపి, ఆభరణాలను దోచుకున్నారు. నగరంలో తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటనపై ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. అక్కడున్న సీసీ ఫుటేజీలను పరిశీలించారు. వాటి ఆధారంగా దోపిడీకి పాల్పడింది ఏడుగురు ముఠా సభ్యులని తేల్చారు. క్లూస్ టీం సేకరించిన ఆధారాలతో వారంతా పాత నేరస్తులుగా తేల్చారు. అంతే కాకుండా నగరానికి చెందిన వ్యక్తి దుండగులకు ఆశ్రయమిచ్చి సహకరించినట్లు గుర్తించారు. సీసీ ఫుటేజీలు ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో నిందితులందరూ బీహార్‌కు చెందిన వారుగా నిర్ధారణకు వచ్చారు.
ఈ క్రమంలో నిందితులను పట్టుకునేందుకు లా అండ్ ఆర్డర్, ఎస్వోటీ, సీసీఎస్ బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగానే ఒక బృందం పుణెకు వెళ్లి అక్కడ తలదాచుకున్న నిందితుడు ఆశీష్కుమార్ను తొలుత అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు దీపక్‌కుమార్‌ను నగరంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితులిద్దరిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 900 గ్రాములు వెండి ఆభరణాల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు.
బీహార్ రాష్ట్రం, శరణ్ జిల్లాకు చెందిన ఆశీష్‌కుమార్ రెండేండ్ల కిందట బతుకుదెరువు కోసం నగరానికి వలసవచ్చి రోజు వారీ కూలీ పని చేసుకుంటూ కూకట్పల్లి జగద్గిరిగుట్ట ప్రాంతంలో నివసిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన స్నేహితుడు దీపక్‌కుమార్ నానక్‌రాంగూడలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే వచ్చే జీతం సరిపోకపోవడంతో ఎలాగైనా దోపిడీ, దొంగతనాలు చేయాలని వీరిద్దరూ నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం స్వరాష్ర్టానికి చెందిన మరో ఐదుగురిని నగరానికి పిలిపించారు.
బీహార్ నుంచి వచ్చిన ముఠాకు ఆశీష్‌కుమార్ 20 రోజుల పాటు జగద్గిరిగుట్టలోని తన నివాసంలో ఆశ్రయం కల్పించాడు. అంతే కాకుండా రెక్కీ నిర్వహించి, చోరీ చేసేందుకు జగద్గిరిగుట్టలోని ఏ1 మోటర్స్‌లో రెండు ద్విచక్రవాహనాలు సెంకడ్ సెల్స్‌లో అశీష్, దీపక్ కొని సిద్ధం చేశారు. ముందస్తు పథకం ప్రకారం ద్విచక్ర వాహనాలపై చందానగర్, పరిసర ప్రాంతాల్లో ఉన్న జ్యువెల్లరీ షాప్‌లను పరిశీలించారు. ఈ క్రమంలో చందానగర్‌లోని ఖజానా జ్యువెల్లర్స్ దోపిడీకి 12 రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. ఈ దుకాణంలో ఉన్న భద్రతా లోపాలు, దోపిడీ చేసి పారిపోయేందుకు అనుకూలంగా ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకుని ఖజానా జ్యువెల్లర్స్ దోపిడీకి స్కెచ్ వేశారు.
ఇందులో భాగంగానే ఈనెల 12న ఉదయం సమయంలో ఆరుగురు నిందితులు రెండు ద్విచక్రవాహనాలపై జ్యువెల్లరీ షాపు వద్దకు చేరుకున్నారు. అనంతరం తమ వెంట తెచ్చుకున్న తుపాకులతో ఖజానా దుకాణంలోకి చొరబడి అక్కడున్న డిప్యూటీ మేనేజర్‌పై కాల్పులు జరపడంతో పాటు నగలను దోచుకున్నారు. తరువాత ఈ ముఠా ద్విచక్రవాహనాలపై అక్కడి నుంచి కొంత దూరం ప్రయాణించి, వాటిని మధ్యలోనే వదిలేసింది. ఆ తరువాత ఈ ముఠా రెండుగా విడిపోయింది.
వారిలో ఆశీష్ రైలు మార్గంలో మహారాష్ట్రకు చేరుకోగా, దీపక్ మిగిలిన ముఠా సభ్యులు బీహార్‌కు పారిపోయారు. ఇదిలా ఉండగా దోపిడీ ముఠాలు వలసకూలీలుగా నగరంలోకి ప్రవేశించడం వల్ల వారి నేరచరిత్ర గుర్తించడం కష్టమవుతున్నదని, లేబర్ కాంట్రాక్టు ఏజెన్సీలు ఆ విషయంపై దృష్టిసారించేలా భవిష్యత్‌లో చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు. సైబరాబాద్ పరిధిలో బీహార్ గ్యాంగ్ దోపిడీకి పాల్పడడం ఇదే మొదటిసారని చెప్పారు.