న్యూఢిల్లీ: ఎర్రకోట సమీపంలో సూసైడ్ బాంబింగ్ (Delhi Bomb Blast) నిందితుడు డాక్టర్ ఉమర్-ఉన్-నబీ అలియాస్ ఉమర్ మహ్మద్‌కు చెందిన పుల్వామాలోని అతని ఇంటిని భద్రతా బలగాలు బాంబులతో పేల్చేశాయి. ఇదే కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధం ఉన్న నలుగురు డాక్టర్లపై (Terror Doctors) నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) చర్యలు తీసుకున్నది. వారి రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. దేశంలో ఎక్కడా వైద్య వృత్తిని నిర్వహించకుండా ఎన్ఎంసీ నిషేధం విధించింది. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్లు నమోదవడం, జమ్ముకశ్మీర్ పోలీసుల నుంచి అందిన సమాచారం, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సమర్పించిన నివేదికలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నది.
డాక్టర్ ముజాఫర్ అహ్మద్, డాక్టర్ అదీల్ అహ్మద్ రాదర్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ షాహీన్ సయీద్‌ల ఇండియన్ మెడికల్ రిజిస్ట్రీ (IMR), నేషనల్ మెడికల్ రిజిస్ట్రీ (NMR) లోని రిజిస్ట్రేషన్‌ను వచ్చేలా రద్దు చేసినట్లు ప్రకటించింది. ఇది వెంటనే అమలులోకి వస్తుందని తెలిపింది. వీరికి ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడుతో సంబంధం కలిగి ఉన్నట్లు ఎన్ఎంసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఎన్ఎంసీ ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాల మెడికల్ కౌన్సిళ్లు ఈ నలుగురు డాక్టర్ల పేర్లను ఇండియన్, నేషనల్ మెడికల్ రిజిస్టర్లను తొలగించాయి.