The Girl Friend | నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నవంబర్ 7న విడుదలైన ఈ లవ్ ఎంటర్టైనర్ సూపర్ హిట్‌గా నిలిచి రెండు వారాల్లోనే రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. రిలేషన్స్‌లో టాక్సిక్ బిహేవియర్ వల్ల అమ్మాయిలు ఎదుర్కొనే భావోద్వేగ, వ్యక్తిగత సమస్యలను నిజజీవితానికి దగ్గరగా చూపించినందుకు మహిళలు ఈ సినిమా కథను తమదిగా భావిస్తూ సోషల్ మీడియాలో విస్తృతంగా స్పందిస్తున్నారు.ఈ నేపథ్యంలో సినిమా చూసిన ఓ యువతి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
రష్మిక సినిమా చూసిన ఆ అమ్మాయి డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్‌ను ప్రత్యక్షంగా కలసి అభినందిస్తూ, సినిమా ఇచ్చిన ధైర్యంతో తాను తన చున్నీ తొలగించి గర్వంగా తిరుగుతానని చూపించింది. ఈ సంఘటనను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక రాహుల్ అయితే ఆమెను మెచ్చుకుంటూ హగ్ కూడా ఇచ్చాడు. అయితే ఈ వీడియో బయటకు రాగానే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం ప్రారంభమైంది.ఒక నెటిజన్ మాత్రం ఇది అన్నీ సినిమా ప్రమోషన్ కోసమే ముందస్తుగా ప్లాన్ చేసిన పీఆర్ స్టంట్ అంటూ, ఆ యువతికి డబ్బులు ఇచ్చి హగ్ సీన్ షూట్ చేయించారని ఆరోపిస్తూ ట్రోల్ చేశాడు. దీనిపై దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గట్టిగా స్పందించారు.
“ఆ అమ్మాయి మీద నెగెటివిటీ రాకూడదనే ఇప్పటివరకు ఏమీ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఈ నిరాధార ఆరోపణలను ఖండించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ థియేటర్‌కి వెళ్లే 20 నిమిషాల ముందు మేము ఎక్కడికి వెళ్లాలో కూడా నిర్ణయించలేదు. ఆ వీడియోను పబ్లిక్ చేయాలా వద్దా అనే ఆందోళన కూడా నాకు ఉంది. కొందరు ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తారని భయపడ్డాను. ఇప్పుడు నిజంగానే ఆమె పట్ల నాకు ఆందోళనగా ఉంది. ఆమె ధైర్యంగా నిలబడాలని కోరుకుంటున్నాను. అలాగే మహిళలపై సమాజం చూపించే పక్షపాత ధోరణిపై రాహుల్ కొరడా ఝళిపించారు. హీరోలు యాక్షన్ సీన్స్‌లో చొక్కా చించుకుంటే ఎవరూ ప్రశ్నించడం లేదు. కానీ ఒక అమ్మాయి యాదృచ్ఛికంగా చున్నీ తీసేసిందంటే మాత్రం సంస్కృతి ప్రమాదంలో పడిపోయింది అంటున్నారు. సంస్కృతిని కాపాడుకోవాల్సిందల్లా మహిళల భుజాలపైనే ఎందుకు మోపారు?, “ది గర్ల్‌ఫ్రెండ్ లాంటి సినిమాలు అవసరమా అని కొందరు అడిగితే… ఈ చిత్రానికి వస్తున్న స్పందన, అమ్మాయిల నిజజీవిత అనుభవాలు స్వయంగా సమాధానం చెబుతున్నాయి” అని రాహుల్ స్పష్టం చేశారు.