Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డేట్స్ దొరకడం అనేది అంత ఈజీ కాదు. ఇప్పటికే అనేకమంది టాప్ దర్శకులు, స్టార్ ప్రొడ్యూసర్లు ఆయనతో సినిమా చేసే అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే వీరందరిని ఆశ్చర్యపరుస్తూ ప్రభాస్ ఒక కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మొదలైంది. ఆ కొత్త దర్శకుడు మరెవరో కాదు, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అని టాక్. ప్రేమ్ రక్షిత్ పేరు వినగానే గుర్తొచ్చేది ‘నాటు-నాటు’ పాట. ఈ పాటకి ప్రేమ్ రక్షిత్ అద్భుతమైన కొరియోగ్రఫీ చేశారు. అదే కాకుండా యమదొంగ, కంత్రీ, ఆర్య 2 లాంటి అనేక పెద్ద సినిమాలకు కొరియోగ్రఫీ అందించిన టాప్ టాలెంట్ ఆయనది.
ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ లో కూడా ముఖ్యమైన సాంగ్స్‌కి ఆయనే కొరియోగ్రాఫర్. ఈ షూటింగ్ సమయంలో ప్రేమ్ రక్షిత్ చెప్పిన ఒక కథ ప్రభాస్‌కి బాగా నచ్చిందట. కథ బలంగా అనిపించడంతో, దర్శక అనుభవం లేకపోయినా, ప్రభాస్ వెంటనే ఓకే చెప్పినట్లు ఫిల్మ్ నగర్లో చర్చ మొదలైంది. ప్రభాస్ ఇప్పటి వరకు కొత్త దర్శకులతో చాలా జాగ్రత్తగా పనిచేశాడు.వంశీ పైడిపల్లితో మున్నా, కొరటాల శివతో మిర్చి చిత్రాలు చేశాడు.ఈ ఇద్దరూ ప్రభాస్ ఇచ్చిన అవకాశాలతో స్టార్ డైరెక్టర్లుగా ఎదిగారు. అలాగే శోభన్, సుజిత్లకు రెండో ఛాన్స్ కూడా ఇచ్చాడు. అదే సమయంలో ప్రస్తుతం ఆయన డేట్స్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సందీప్ రెడ్డి వంగా త్వరలో ప్రభాస్‌తో స్పిరిట్ చిత్రం చేయనుండగా, నాగ్ అశ్విన్ (కల్కి 2898 AD Part 2),
ప్రశాంత్ నీల్ (సలార్ 2: శౌర్యంగ పర్వం) చిత్రాలు చేయనున్నాడు. అయితే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ప్రభాస్ కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నాడంటే అది ఇండస్ట్రీలో పెద్ద వార్తగా మారటమే కాదు, పెద్ద రిస్క్ కూడా చేస్తున్నాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం వీరిద్దరి కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ ప్లాన్ జరుగుతోందట. అయితే ప్రేమ్ రక్షిత్ తీసే మూవీలో ప్రభాస్ హీరోగా నటిస్తాడా లేకుంటే ఆ మూవీని ప్రొడ్యూస్ చేస్తాడా అనే దానిపై పూర్తి క్లారిటీ లేదు.