చిక్కడపల్లి, మే 28: చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు చాకలి శ్రీలక్ష్మి డిమాండ్ చేశారు. చాకలి ఎస్సీ సాధన సమితి 8వ వార్షికోత్సవ సభ బుధవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా అధ్యక్షురాలు చాకలి శ్రీ లక్ష్మీ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న తమ బతుకు చిత్రం మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో 18 రాష్ట్రాలలో, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలలో చాకలి కులస్తులు ఎస్సీ జాబితాలో ఉన్నారని, అదేవిధంగా తెలంగాణలో కూడా ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.