కనీసం రోడ్లు కూడా సరిగాలేని చోట ఫోర్త్ సిటీ అంటూ రెండేండ్లుగా ఉదరగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యూహాలు బెడిసికొడుతూనే ఉన్నాయి. ఒకవైపు హైదరాబాద్ నగరంలో రియల్ రంగాన్ని కుదేలు చేసి..ఫోర్త్ సిటీ చుట్టుపక్కల భూముల్లోకి తరలించాలనుకున్నా పాచికలు పారడం లేదు. నిన్నటికి నిన్న జనంలేని ఊహా నగరంలో మెట్రో కూతల్ని వినిపించాలని అనుకున్నా.. సాంకేతిక కారణాలు చూపి కేంద్రం పీటముడి వేసి షాక్ ఇచ్చింది. తాజాగా గ్లోబల్ సమ్మిట్ పేరిట వందల కోట్లు వెచ్చించి హడావుడి చేసినప్పటికీ షో అట్టర్‌ఫ్లాప్ కావడంతో మళ్లీ ఫోర్త్ సిటీ భూములు బోసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతుండగా, హైదరాబాద్ నగరంలో మౌలిక వసతుల అభివృద్ధి పనులకు ఒక్క ఇటుక పేర్చకుండా జనం లేని ఫోర్త్ సిటీని ఎత్తేందుకు మాత్రం ప్రభుత్వం ఆపసోపాలు పడుతున్నది.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరాభివృద్ధి రెండేండ్లుగా కుంటుపడిందనేది అక్షర సత్యం. ఒక్కటంటే ఒక్క అభివృద్ధి ప్రాజెక్టు శిలా ఫలకాలు దాటి అడుగు ముందుకు వేయడం లేదు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉన్న నగరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఫోర్త్ సిటీపైనే ధ్యాస పెడుతున్నా.. ఆ ప్రయత్నాలు మాత్రం సఫలీకృతం కావడం లేదు. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో టెండర్లు పూర్తయి… సర్వే ప్రక్రియ కూడా ముగించుకొని పనులు మొదలుపెట్టే దశకు వచ్చిన రాయదుర్గం-ఎయిర్‌పోర్టు మెట్రోను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అనాలోచితంగా, దురుద్దేశంతో రద్దు చేసింది.
ఇందుకు అక్కడ ఎయిర్‌పోర్టుకు పోయే జనం సొంత కార్లలోనే వెళ్తారు తప్ప..మెట్రో ఎందుకు ఎక్కుతారాంటూ ఆక్యుపెన్సీ లేదనే సాకు చూపారు. ఇదే సమయంలో పురుగు కూడా లేని ఫోర్త్ సిటీకి ఆగమేఘాల మీద మెట్రోను తీసుకుపోయేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. వాస్తవానికి మెట్రో విస్తరణ ప్రాజెక్టుల్లో భాగంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ. 45వేల కోట్ల అంచనా వ్యయంతో ఎనిమిది కారిడార్లలో 162.4 కిలోమీటర్ల మెట్రో ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి పంపింది. ఇందులో శంషాబాద్ నుంచి ఫోర్త్ సిటీ వరకు 39.6 కిలోమీటర్ల మెట్రో కారిడార్‌ను ప్రతిపాదించింది. కేంద్రం మెట్రో విస్తరణకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగానే అన్నింటికంటే ముందుగానే ఫోర్త్ సిటీ మెట్రోను పట్టాలెక్కించాలని వ్యూహం రచించింది.
రాష్ట్ర ప్రభుత్వం పంపిన డీపీఆర్‌ను పరిశీలించిన కేంద్రం.. ప్రస్తుతం కొనసాగుతున్న మొదటి దశ మెట్రో ఎల్అండ్టీ చేతిలో ఉండటంతో విస్తరణను ఆ కంపెనీతో చేయించుకోవాలని సూచించింది. ఎల్అండ్టీ సహకరించదని ముందుగానే గుర్తించిన ప్రభుత్వం.. చివరకు రాష్ట్ర ఖజానాపై పెను భారం పడుతుందని తెలిసినా.. ఎల్అండ్టీకి అప్పనంగా రూ.2వేల కోట్లు ఇచ్చి మెట్రో ప్రాజెక్టును టేకోవర్ చేసేందుకు సిద్ధమైంది. కేంద్రం మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు త్వరితగతిన అనుమతినివ్వాలని, తద్వారా ఫోర్త్ సిటీ మెట్రోను వెంటనే చేపట్టి ఆ పరిసర ప్రాంతంలోని భూములకు రియల్ డిమాండును పెంచేందుకే ప్రభుత్వం ఇలా చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పీటముడి వేసి షాక్ ఇచ్చిన కేంద్రం..
మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని కేంద్రం చెప్పినట్లు పిల్లిమొగ్గలు వేసినా మరో రూపంలో కేంద్ర ప్రభుత్వం రేవంత్ సర్కారు షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఒకే డీపీఆర్ కింద మెట్రో ప్రతిపాదనలు ఇచ్చినప్పటికీ కారిడార్ల వారీగానే తాము పరిగణలోనికి తీసుకోవడంతో పాటు ప్రాధాన్యతా క్రమంలో మాత్రమే అనుమతులు ఇస్తామంటూ కొన్నిరోజుల కిందట కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ చెప్పారు. డీపీఆర్ పరిశీలనలో భాగంగా సాంకేతిక అంశాలను పరిశీలించిన కేంద్రం ఫోర్త్ సిటీకి సంబంధించి ఆక్యుపెన్సీ అంచనా ఎలా ఉందంటూ పీటముడి వేసింది. రోజుకు రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల మంది వరకు ప్రయాణికులు రాకపోకలు ఉంటేనే ఆ మెట్రో ఆక్యుపెన్సీపరంగా సంతృప్తికరమని ఆమోదం ఇస్తారు.
జనసంచారమేలేని ఫోర్త్‌సిటీలో కనీసం వేలల్లోనూ ప్రయాణికులు ఉండే అవకాశమే లేదు. ఆక్యుపెన్సీ ఉన్నా లేదంటూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ హయాంలో చేపట్టిన ఎయిర్‌పోర్టు మెట్రోను రద్దు చేస్తే.. ఇప్పుడు అదే ఆక్యుపెన్సీ అంశాన్ని కేంద్రం ఫోర్త్ సిటీ మెట్రోకు అడ్డంకిగా నిలిపింది. ఫోర్త్ సిటీ మెట్రో ఇప్పట్లో సాకారం అయ్యేదికాదనే నిర్ణయానికి అధికారులు వచ్చారు. ఎలాగైనా ఫోర్త్ సిటీ చుట్టుపక్కల రియల్ రంగానికి బూస్టింగ్ ఇవ్వాలని మెట్రో ప్రతిపాదనను పెడితే అది బెడిసికొట్టడంతో గ్లోబల్ సమ్మిట్ పేరిట ప్రభుత్వం మరో విఫలయత్నానికి పాల్పడింది. రెండ్రోజుల సమ్మిట్ అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోగా, రియల్ ఎస్టేట్ వెంచర్లో ప్రమోషన్ ప్రక్రియలా ముగిసింది.