డివిజన్ల పునర్విభజన పూర్తిగా అశాస్త్రీయంగా.. అనాలోచితంగా ఉందంటూ..ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. డివిజన్ల విభజన ప్రక్రియ సక్రమంగా, విధివిధానాలకు అనుగుణంగా లేదని మండిపడుతున్నారు. కాలనీ పేర్లు స్పష్టంగా లేకపోవడంతో డివిజన్ల సరిహద్దులను ప్రజలు గుర్తించలేకపోతున్నట్లు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవాలన్నారు. వార్డుల విభజన గందరగోళంగా ఉందని, ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలను పరిశీలించి..పారదర్శకంగా వార్డుల విభజన చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బల్దియా డివిజన్ల పునర్విభజనపై రూపొందించిన ముసాయిదా ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నదని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు.
కుత్బుల్లాపూర్,డిసెంబర్12: గ్రేటర్ హైదరాబాద్ విస్తరణలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మొత్తం 24 డివిజన్లుగా ఏర్పాటు చేస్తున్నట్లు గెజిట్ విడుదల చేసిన విషయం విదితమే. వీటిలో నిజాంపేట్, బాచుపల్లి, బండారిలేఅవుట్, ప్రగతినగర్, మహాదేవపురం, గాజులరామారం, రోడామేస్త్రీనగర్, జగద్గిరిగుట్ట, రంగారెడ్డినగర్, చింతల్, గిరినగర్, కుత్బుల్లాపూర్, పద్మానగర్,సుచిత్ర, జీడిమెట్ల,కొంపల్లి, దూలపల్లి, రాంరెడ్డినగర్, షాపూర్‌నగర్, సుభాశ్‌నగర్, సూరారం, బహదూర్‌పల్లి, భౌరంపేట్ , దుండిగల్ డివిజన్లుగా విస్తరిస్తున్నట్లు గెజిట్‌లో పేర్కొన్నారు. డివిజన్ల పునర్విభజన పూర్తిగా అశాస్త్రీయంగా..అనాలోచితంగా ఉందంటూ ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవడం గమనార్హం. అస్పష్టంగా ఉన్న వార్డుల విభజనపై శుక్రవారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పార్టీ అధ్యక్షుడు, సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. తమ అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలే మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.
కూకట్‌పల్లిలో..
కేపీహెచ్‌బీ కాలనీ: కూకట్పల్లి నియోజకవర్గంలో వార్డుల విభజన గందరగోళంగా ఉందని, ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలను పరిశీలించి పారదర్శకంగా వార్డుల విభజన చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. శుక్రవారం కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్‌ను ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్లు కలిసి వార్డుల విభజనపై అభ్యంతరాలను తెలుపుతూ వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ. కూకట్పల్లి, మూసాపేట సర్కిళ్ల పరిధిలో వార్డుల విభజన శాస్రీయంగా లేదని, ఒక నియోజకవర్గంలోని ప్రాంతాలను మరోక నియోజకవర్గంలో కలిపారని, కాలనీలు, బస్తీలను రెండు, మూడు ముక్కలు చేసి ఆయా వార్డుల్లో కలుపారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్‌రావు, జూపల్లి సత్యనారాయణ, ముద్దం నర్సింహయాదవ్, ఆవుల రవీందర్‌రెడ్డి, పండాల సతీశ్‌గౌడ్, మహేశ్వరి శ్రీహరి, సబీహగౌసొద్దీన్, మాజీ కార్పొరేటర్లు పగుడాల బాబురావు, తూము శ్రావణ్‌కుమార్, ఆయా కాలనీల ప్రతినిధులు ఉన్నారు.

శేరిలింగంపల్లి లో..
మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వార్డుల విభజన ప్రక్రియను ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేసిందని,అభ్యంతరకరంగా ఉన్నదని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ప్రభుత్వానికి అనుకూలంగా చేసిన విభజనే తప్ప ప్రజలకు అంత ఉపయోగకరంగా లేదన్నారు. శుక్రవారం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడేను ఆయన కార్యాలయంలో కలిసి బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ జాతీయ రహదారులను విస్మరించి కాలనీల్లో చిన్న గుర్తులను హద్దులుగా నిర్ణయించారని, విభజనకు సంబంధించిన మ్యాపులను అధికార కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు తప్ప ప్రజలకు , ప్రతిపక్షాలకు ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి, హరీశ్‌రావు,రోజా, శ్రీనివాస్‌రావు, రామకృష్ణ గౌడ్, కిరణ్‌యాదవ్, అల్లావుద్దీన్, గౌస్, బాలరాజు, సంతోష్, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వెంకటేశ్వరనగర్ను డివిజన్‌గా ప్రకటించాలి..
వార్డుల విభజనతో వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరనగర్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని కాలనీ జేఏసీ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేశ్వరనగర్ అతి పెద్దదని, అధిక సంఖ్యలో ఓటర్లున్నారని తెలిపారు. వెంకటేశ్వరనగర్‌కు స్వతంత్ర డివిజన్‌గా ప్రకటించాలని కోరుతూ ఎమ్మెల్యే, జడ్సీ, బల్దియా కమిషనర్లను కలిసి విన్నవించనున్నట్లు జేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రతినిధులు సంజీవరెడ్డి, హరినాథ్, శ్రీనివాస్‌రెడ్డి, కుమారస్వామి, వెంకటస్వామి, వెంకటకుమార్, ఆంజనేయులు, దుర్గప్రసాద్, లక్ష్మీనర్సయ్య, సత్యనారాయణ, చందు, మునీశ్వర్రావు, సత్యనారాయణ, భీమ్రావు, శ్రీధర్, రమేశ్, యాదగిరి, అరవింద్, రాంచందర్, శ్యామ్, రేణుక తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల వెల్లువ
డివిజన్ల పునర్విభజనపై ఏడు రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణకు అవకాశం కల్పించారు.
తేదీ : ఫిర్యాదులు
డిసెంబర్-10 : 40
డిసెంబర్-11 : 280
డిసెంబర్-12 : 373