సిటీబ్యూరో, డిసెంబర్ 12(నమస్తే తెలంగాణ): ఆ సీటు వదలాలంటే వారికి నచ్చడం లేదు.. ఏళ్ల తరబడి అదే సీటులో కొనసాగుతున్నా ఆ కుర్చీపై మక్కువ తీరడం లేదు. హెచ్ఎండీఏలో జెన్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ నుంచి డిప్యుటేషన్‌పై కొందరు ఇంజినీర్లు ఎలక్ట్రికల్ డివిజన్లో పనిచేస్తున్నారు. ఆరేళ్లుగా ఇదే సెక్షన్లో కొనసాగుతున్న నేపథ్యంలో మాతృసంస్థకు తిరిగి రావాలంటూ డిప్యుటేషన్లు రద్దు చేస్తూ జెన్కో సీఎండీ హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారు. కొందరు ఉద్యోగులు తమ సంస్థలకు వెనక్కు వెళ్లినా కొందరు మాత్రం సీటును వదలలేక పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఏకంగా సంబంధిత శాఖామంత్రిని పట్టుకుని తమ డిప్యుటేషన్లు కొనసాగించడానికి కావాల్సిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి డిప్యుటేషన్‌ను కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఒక్కో పోస్టుపై యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేయడానికి కూడా సిద్దంగా ఉన్నారనే చర్చ జరుగుతోంది.
డిప్యుటేషన్లు రద్దయినా..
విద్యుత్‌శాఖకు సంబంధించిన పలువురు ఇంజినీర్లు హెచ్ఎండీఏలో ఎలక్ట్రికల్ డివిజన్లో పనిచేస్తున్నారు. గత ఆరేళ్లుగా ఇదే సెక్షన్లో కొనసాగుతున్న నేపథ్యంలో జెన్కో సీఎండీ హరీశ్ వారిని మాతృసంస్థకు వెనక్కు పంపుతూ గత నెలలోనే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వచ్చినప్పటికీ ఇప్పటికీ అదే సీటులో పనిచేస్తున్న ఇంజినీర్ల నిర్వాకంపై జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో చర్చ జరుగుతోంది. తమ మాతృసంస్థలకు రావాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించినా కొందరు ఇంజినీర్లు అదేస్థానాల్లో ఉండడానికి పైరవీలు చేసుకుంటున్నట్లు సమాచారం.
అసలు వీరు అదే సీటులో ఉండడానికి కారణాలేంటనే కోణంలో సంస్థకు సంబంధించిన కొందరు అధికారులు ఆరా తీశారు. హెచ్ఎండీఏలో చేస్తే నగరంలో తాము అనుకున్నట్లుగా సంపాదన ఉంటుందనే కోణంలో వారు ఈ సీటు వదలడం లేదంటున్నారు. ఎన్పీడీసీఎల్కు చెందిన ఒక అధికారి డిప్యుటేషన్‌పై హెచ్ఎండీఏలో ఈఈగా పనిచేస్తున్నారు. ఆయన డిప్యుటేషన్‌ను పొడగిస్తూ ఉత్తర్వులు రానప్పటికీ అదే సీటులో కొనసాగుతున్నారు. మరోవైపు జెన్కోకు చెందిన ఒక ఏడీఈ ప్రస్తుతం హెచ్ఎండీఏలో డీఈగా కొనసాగుతున్నారు.
ఈ అధికారికి కూడా ఇప్పటివరకు ఎక్స్టెన్షన్ లేకపోగా వారం రోజుల్లోగా తమ మాతృసంస్థల్లో జాయిన్ కావాలని గత నెల 22న సీఎండీ హరీశ్ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అదే సీటులో ఉంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే హెచ్ఎండీడిఏలో ప్రస్తుతం డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న విద్యుత్ ఇంజినీర్లలో కొందరికి ఎక్స్టెన్షన్ రాకపోగా మరికొందరిని మాతృసంస్థలకు రమ్మని, ఇంకొందరిని యాదాద్రి పవర్‌ప్లాంట్‌కు వెళ్లాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. అయినా వారిలో కొందరు మాత్రమే ఆ ఉత్తర్వులు పాటించి వెనక్కు తిరిగి వెళ్లగా మరికొందరు రాజకీయ, అధికార బలంతో తమ డిప్యుటేషన్లను కొనసాగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలున్నాయి.