బేగంపేట్, ఏప్రిల్ 25: ఇళ్లలో ఒంటరిగా ఉండే వృద్ధ మహిళలే లక్ష్యంగా బంగారు ఆభరణాల దోపిడీకి పాల్పడుతున్న పేరుమోసిన దొంగ పాపాని క్రాంతికుమార్(32)ను బేగంపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.8 లక్షలు విలువచేసే 9.8 తులాల బంగారు ఆభరణాలు, హోండా సీబీ షైన్ మోటార్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం బేగంపేట పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ గోపాలకృష్ణమూర్తి, ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, డీఐ మధులతో కలిసి నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ వివరాలను వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలోని మధురా నగర్‌కు చెందిన పాపాని క్రాంతికుమార్ తొలుత చిన్నచిన్న వ్యాపారాలు చేస్తుండేవాడు. ఆ తరువాత జల్సాలు, జూదానికి అలవాటు పడి చోరీలు చేయడం మొదలుపెట్టాడు. హైదరాబాద్ పాటు తిరుపతి ప్రాంతాల్లో 14 సంఘనటల్లో ఇళ్లలో దొంగనాలకు పాల్పడ్డాడు. జైలుకు వెళ్లి వచ్చి తిరిగి చోరీలు చేయడం ప్రారంభించాడు. చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలో చోరీ చేసిన హోండా సీబీ షైన్ మోటార్ బైక్స్ బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లు ఉన్న ప్రాంతాల్లో తిరుగుతూ వృద్ధులైన మహిళలు ఒంటరిగా ఉండే ఇళ్లను చోరీలు చేయడం కోసం ఎంచుకునేవాడు.
తలుపులు తెరచిఉన్న, మహిళలు ఒంటరిగా ఉన్న ఇళ్లలోకి చొరబడి వారి మెడలోని బంగారు గొలుసులు తెంచుకుని ఉడాయిస్తున్నాడు. ఇక అద్దె ఇల్లు కోసం వాకబు చేస్తున్నట్లు నటిస్తూ కూడా ఒంటరిగా ఉండే మహిళల ఒంటిపైని నగలు దోచుకుని పరారవుతుంటాడు. ఈ నెల 17వ తేదీన బేగంపేట పోలీసు స్టేషన్ పరిధిలోని మయూరి మార్గ్ లో ఓ ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న కమల అనే మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు తెంచుకుని పరారయ్యాడు. దీంతో బాధితులు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి చోరీ సొత్తు రికవరీ చేశారు.