సిటీబ్యూరో/శేరిలింగంపల్లి/శామీర్‌పేట/జవహర్‌నగర్: సైబరాబాద్ పరిధిలో స్నాచర్లు రెచ్చిపోతున్నారు. గతంలో మహిళలనే టార్గెట్ చేసి స్నాచింగ్లకే పాల్పడే దుండగులు ఇప్పుడు పురుషులను కూడా వదలడం లేదు. స్నాచింగ్‌ల కోసం ప్రాణాలు తీస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా దుండగులు తమ చేతివాటం చూపిస్తున్నారు. సైబరాబాద్ పరిధిలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలు మందగిస్తున్నాయని పోలీసింగ్ నిద్రావస్థకు చేరుకోవడం వల్లనే స్నాచింగ్‌లు, దొంగతనాలు, దోపిడీలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నట్లు బాధితులు వాపోతున్నారు. మహిళలు బయట తిరగలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు స్టేషన్లలోని అధికారులు, సిబ్బంది ఠాణాలను వదిలి బయటకు రావడం లేదని, చాలా మంది సీఐలు, ఎస్ఐలు ఠాణాలకు వచ్చే భూ తగాదాలు, ఇతర గిట్టుబాటు అయ్యే కేసుల పరిష్కారం వైపే మొగ్గు చూపుతున్నట్లు జనం ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే సోమవారం ఒక్కరోజే శామీర్‌పేట, జవహర్‌నగర్ ఠాణాల పరిధిలో రెండు చైన్‌స్నాచింగ్‌లు చోటుచేసుకోగా ఈనెల 11న రాయదుర్గ ఠాణా పరిధిలో ఒక వ్యక్తి నుంచి సెల్‌ఫోన్ స్నాచింగ్‌కు పాల్పడిన దుండగులు హత్యచేయడం వంటి ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. శాంతిభద్రతలను కాపాడుతూ నేరాలు జరగకుండా చూడాల్సిన పోలీసులు ఈ మధ్య కాలంలో నేరాలు జరిగిన తరువాత మాత్రమే స్పందిస్తున్నట్లు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు నేరం జరిగిన తరువాత నేరస్తులను పట్టుకుని తమ బాస్‌లతో శభాష్ అనిపించుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. రాయదుర్గ ఠాణా పరిధిలో స్నాచర్ల చేతిలో హత్యకు గురైన నిందితులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు.
నగరంలోని టోలిచౌకి హకీంపేట్ ప్రాంతానికి చెందిన టైల్స్ పనిచేసే మహమ్మద్ రెహన్, కారు వాష్ పనిచేసే మహమ్మద్ ఇబ్రహీం అహ్మద్‌లతో పాటు మరో ఇద్దరు మైనర్లు జులాయిగా తిరుగుతుంటారు. ఈనెల 11న రాత్రి 11.30 గంటల సమయంలో హీరోహోండా ఫ్యాషన్ప్లస్(ఏపీ13పీ8980), నంబర్ లేని మరో డ్యూక్ ద్విచక్రవాహనాలపై నలుగురు జుబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 మీదుగా రాయదుర్గం వైపు వస్తున్నారు. మార్గమధ్యలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువకుడిని లిప్టు పేరుతో బైక్‌పై ఎక్కించుకున్నారు. కొద్దిదూరం వెళ్లాక సదరు యువకుడిని బెదిరించి మొబైల్ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. పెనుగులాట చోటుచేసుకోవడం,వాహనాలు రావడంతో నిందితులు పారిపోయారు.
కాసేపటికి నందిహిల్స్ రాయదుర్గం రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న సదరు యువకుడిని వెంబడించి మార్గమధ్యలో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద నుంచి సెట్రింగ్ కర్రలు తీసుకొని విచక్షణ రహితంగా దాడిచేశారు. అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను లాక్కోని నలుగురు నిందితులు పరారయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి గాయాలతో రోడ్డు పక్కన పడి ఉన్నట్లు 100 డయల్ ద్వారా సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. 12న రాయదుర్గం ప్రశాంతిహిల్స్‌కు చెందిన మహమ్మద్ ఓమర్ తన తమ్ముడు కనిపించడం లేదని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫిర్యాదుదారుడు తమ్ముడి ఫొటోను గుర్తించి గాయాలకు గురైన వ్యక్తితో పోలిస్తే ఇద్దరు ఒకటేనని గుర్తించారు.
బీహార్ మధుబానీ ప్రాంతానికి చెందిన సౌరబ్కుమార్ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి ప్రశాంతిహిల్స్‌లోని తనఅన్న వద్ద ఉంటు సీసీటీవీ మెకానిక్‌గా విధులు నిర్వర్తిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా 13న ఉస్మానియాలో చికిత్స పొందుతూ సౌరబ్కుమార్ మృతి చెందాడు. సీసీటీవీ పుటేజీ అధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించి వారిని సోమవారం అదుపులోకి తీసకున్నారు. వారి వద్ద నుంచి చోరిచేసిన సెల్‌ఫోన్‌తో పాటు రెండు ద్విచక్రవాహనాలు, రూ. 2000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీం అహ్మద్, మహమ్మద్ రెహన్లను రిమాండ్‌కు, మైనర్లను జువైనల్ హోంకు తరలించినట్లు మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ తెలిపారు. రాయదుర్గం సీఐ వెంకన్న, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ భూపతి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
దమ్మాయిగూడలో రోడ్డుపై నడుచుకుంటూ వెలుతున్న ఓ మహిళ మెడలోంచి గొలుసును బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు లాక్కెళ్లిపోయారు. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి దమ్మాయిగూడలో చోటుచేసుకుంది. కుషాయిగూడ ఏసీపీ వెంకట్‌రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం… జవహర్‌నగర్ కార్పొరేషన్ అంబేద్కర్‌నగర్‌లో స్వరూప కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నారు.
ఆమె దమ్మాయిగూడలోని పలు ఇళ్లల్లో పారిశుధ్య పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం ఉదయం 10గంటల సమయంలో ఓ ఇంట్లో పనిచేసి.. మరో ఇంటికి వెలుతున్న క్రమంలో దుండగులు బైక్‌పై వెనుక నుంచి వచ్చి మెడలోని గొలుసు గుంజుకుపోయారు. స్వరూప కిందపడిపోయి లేచి తెరుకునేలోపే దొంగలు బైక్‌పై పరాయయ్యారు. 2.5 తులాల బంగారు గొలుసును ఎత్తుకుపోయారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో మహిళా స్వప్నమెడలో గొలుసును లాక్కెళ్లే ప్రయత్నం చేయగా ప్రతిఘటించింది.
శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. తూంకుంటకు చెందిన మలారం జమునా పబుల్ క్రీక్ సూల్ కు వెళ్తుండగా ఓల్డ్ కైసర్ జిమ్ వద్ద నలుపు-ఎరుపు పల్సర్ పై వచ్చిన ఇద్దరు దొంగలు ఆమె మెడలోని 37.5 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని లాకొని పరారయ్యారు. ఆ ఇద్దరు నిందితులు నాచారం, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిల్లో చైన్ స్నాచింగ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళలు ఒంటరిగా ప్రయాణించవద్దని, బంగారు ఆభరణాలు బహిర్గతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.