సిటీబ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం చెట్లను నరికేసిన 400 ఎకరాల భూములు న్యాయబద్ధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకే చెందుతాయని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ నివేదికలో తేల్చిందని స్టూడెంట్ యూనియన్ వెల్లడించింది. ఆ భూముల్లో జరిగిన విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లు సుప్రీం కోర్టుకు నివేదించిందని స్టూడెంట్ యూనియన్ నేతలు పేర్కొన్నారు. శుక్రవారం కేంద్ర సాధికార కమిటీ నివేదికలోని ప్రధాన అంశాలను ప్రస్తావిస్తూ పోస్టర్లను విడుదల చేశారు. ఆ పోస్టర్లలోని అంశాల ప్రకారం… చారిత్రక రికార్డులు, న్యాయపరమైన ఆధారాల ప్రకారం 400 ఎకరాలతో పాటు హెచ్సీయూ పరిధిలో ఉన్న భూములన్నీ వర్సిటీకే చెందుతాయి.
చట్టబద్ధమైన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూములను టీజీఐఐసీకి కట్టబెట్టింది. ఆ భూములపై హక్కులను టీజీఐఐసీకి బదాలయించడంలో అనేకమైన లోపాలుండటంతో పలు అనుమానాలకు తావిస్తున్నది. ఈ ముఖ్యమైన అంశాలను సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని సీఈసీ విన్నవించింది. అడవిని తలపించేలా వృక్ష, జంతు సంపదను కలిగిన 400 ఎకరాల్లో జరిగిన విధ్వంసాన్ని అన్ని వర్గాల వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు, వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్, ఎకాలజిస్టులు, ఐటీ, రిమోట్ సెన్సింగ్ అధికారులు విధ్వంసంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అడవిగానే గుర్తించాలి. రాష్ట్రంలోని వివిధ శాఖల నుంచి సేకరించిన ఆధారాలు కూడా ఆ ప్రాంతం అడవిగానే తేల్చింది. ఆ భూముల్లో ఏండ్ల తరబడిగా ఉన్న రాళ్లు, వాటి నిర్మాణాలను పూర్తిగా ధ్వంసం చేయడం, వేలాది చెట్లు కూల్చడంతో వందలాది జీవుల ఆవాసాన్ని కొల్లగొట్టినట్లయింది. విద్యార్థులపై పోలీసుల తీరు న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. వారిపై కూడా చర్యలు తీసుకోవాలని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సుప్రీంకు నివేదించింది.