దేశంలో ప్రధాన మెట్రో నగరాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్ మహానగరంపై గత పదేండ్లుగా కేంద్రం చిన్న చూపు చూస్తున్నది. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ నిధులు ఇవ్వకపోగా, తాజాగా జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలోనూ మెట్రో రైలు విషయంలో తెలంగాణకు మొండిచెయ్యి చూపింది. హైదరాబాద్‌ను విస్మరించి.. దేశంలోని మూడు మెట్రో రైలు ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించింది. మరీ ప్రధాని మోదీ ‘నా బడే బాయి’ అని చెప్పుకునే చోటే బాయి(సీఎం రేవంత్‌రెడ్డి) ఈ విషయంలో ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం ఏమిటని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. కేంద్రం రాష్ట్ర అభివృద్ధికి సహకరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Hyderabad Metro | సిటీబ్యూరో, ఆగస్టు 17(నమస్తేతెలంగాణ) : ఇటీవల ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి నిధులు ఇవ్వని కేంద్ర ప్రభుత్వం..శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలోనూ దేశంలోని మూడు మెట్రో రైలు ప్రాజెక్టులకు భారీగా నిధులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌పై మాత్రం కేంద్రం చిన్న చూపు చూస్తున్నదనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. నగరంలో మెట్రో రెండో దశ పనుల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినా పట్టించుకోలేదు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి మెట్రో రెండో దశ ప్రాజెక్టుల విషయాన్ని కేంద్రం ముందు ఉంచినా.. గుండు సున్నాయే చూపడం గమనార్హం.
ఎన్నికలకు ముందు మహారాష్ట్రకు వరాలు..
మహారాష్ట్రలో ప్రస్తుతం బీజేపీ మద్దతుతో కూడిన ప్రభుత్వం అధికారంలో ఉంది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలోనే అక్కడ రెండు మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ నిధులు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. ఇందులో థానే ఇంటిగ్రల్ రింగ్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.12200.00 కోట్లు, పుణె మెట్రో రైలు ప్రాజెక్టు కోసం రూ. 2954.53 కోట్లు కేటాయించింది. వీటికి తోడు తెలంగాణ పక్కనే ఉన్న కర్ణాటక రాష్ర్టానికి సంబంధించి బెంగళూరు మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-3 కోసం రూ.15,611 కోట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇలా తెలంగాణకు ఇరువైపులా ఉన్న రెండు రాష్ర్టాల్లోని మూడు మెట్రో రైలు ప్రాజెక్టులకు ఒకేసారి మొత్తం రూ.30,765 కోట్లకు ఆమోదం తెలిపింది. కానీ హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులకు మాత్రం కేంద్ర ప్రభుత్వం పదేండ్లుగా మొండిచెయ్యి చూపుతూనే ఉన్నది.
బీహెచ్ఈఎల్-లక్డీకాపూల్ ప్రతిపాదనలు..
హైదరాబాద్ నగరంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీహెచ్ఈఎల్-లక్డీకాపూల్ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్రానికి సమర్పించింది. 23 కి.మీ మేర నిర్మించే ఈ మార్గానికి సుమారు రూ.8500 కోట్ల వ్యయం అవుతుందని, దీనికి ఆమోదం తెలిపి నిధులు కేటాయించాలని కోరినా.. నరేంద్ర మోదీ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణానికి కేంద్రం సహకరించాలని అనేకసార్లు స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. అయినా హైదరాబాద్ మెట్రో పేరు ఎత్తలేదు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా.. రాష్ట్ర అభివృద్ధి పట్ల కేంద్రం ఏమాత్రం సహకరించడం లేదనే విమర్శలున్నాయి.
కేంద్ర కేబినెట్లో ఆమోదం పొందిన మెట్రో ప్రాజెక్టులు