సిటీబ్యూరో, సెప్టెంబరు 14 (నమస్తే తెలంగాణ ): జీహెచ్ఎంసీ పరిధిలో జనన, మరణ సర్టిఫికెట్ల జారీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు శాశ్వత చెక్ పెట్టాలన్న ఉద్దేశంలో భాగంగా సీఆర్ఎస్(సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం) విధానం అమలు మరింత జాప్యం కానుంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోఈ సీఆర్ఎస్ విధానం అమలుపై ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులు ఢిల్లీలోని సీఆర్ఎస్ సెక్రటరీ, ఇతర అధికారులతో ఐదుసార్లు జూమ్ మీటింగ్‌లు నిర్వహించారు. ఆధార్ తరహాలో 16 అంకెల యూనిక్ నంబర్‌తో సర్టిఫికెట్లు జారీ చేయడం ద్వారా అక్రమాలకు చెక్ పెట్టవచ్చని ..ఇందుకు ప్రస్తుతం ఉన్న ఫార్మెట్, సాఫ్ట్‌వేర్‌ను మార్చడంతో పాటు పాత డేటాను మ్యాపింగ్ చేయాలని జీహెచ్ఎంసీకి కేంద్రం పలు సూచనలు చేసింది.
ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల జనన, మరణ సమాచారాన్ని అధ్యయనం చేసి గత డేటాను సీఆర్ఎస్లోకి మ్యాప్ చేయనున్నారు..ఈ మ్యాపింగ్ ప్రక్రియలో ఆయా జిల్లాల రిజిస్ట్రార్లను సమన్వయం చేయనున్నారు. పాత డేటాను సీఆర్ఎస్లోకి బదిలీ చేయడం ద్వారా భవిష్యత్తులో దేశంలో ఎక్కడి నుంచైనా యూనిక్ నంబర్‌తో జనన, మరణ సర్టిఫికెట్లను సులభంగా పొందే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సీఆర్ఎస్ విధానం అమలైతే జీహెచ్ఎంసీ పరిధిలో జనన, మరణ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ పారదర్శకంగా, అక్రమాలకు ఆస్కారం లేకుండా సాగుతుందని చెబుతున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీకి ఇకపై కేంద్ర రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయానికి చెందిన సీఆర్ఎస్ ( సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం) పోర్టల్‌ను అమలు చేయాలని నిర్ణయించి.. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి ఇలంబర్తి మెమో జారీ చేశారు. ప్రస్తుతం అమలవుతున్న విధానం ద్వారా అవినీతి, అక్రమాలు జరగడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ జరుగుతుందని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే సీఆర్ఎస్ విధానాన్ని ఢిల్లీ మహా నగరం పకడ్బందీగా అమలు చేస్తున్న విధానాన్ని జీహెచ్ఎంసీ అనుసరించనున్నది.
ప్రస్తుతం ఉన్న ఫార్మెట్, సాఫ్ట్‌వేర్‌ను మార్చనున్నారు. జీహెచ్ఎంసీ పరిధి అర్బన్ ఏరియాగా ఉన్నప్పటికీ 2007లో రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి గ్రామీణ ప్రాంతాలు, ఆ తర్వాత రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల గ్రామీణ ప్రాంతాలు జీహెచ్ఎంసీలో విలీనం అయ్యాయి. గతంలో ఈ ప్రాంతాల్లో జనన, మరణ రిజిస్ట్రేషన్లు కలెక్టర్లు, ఆర్డీఓలు నిర్వహించే వారని, ఆ సమాచారం రెవెన్యూ శాఖలో ఉందని అధికారులు తెలిపారు. డేటా మ్యాపింగ్‌లో వీరిని సమన్వయం చేయనున్నారు.
ఈ విధాన అమలుపై పూర్తిగా అనుభవం ఉన్న అధికారులను ఎంపిక చేసి తొలుత శిక్షణ ఇచ్చి ఆ తర్వాత వచ్చే నెల మొదటి వారం నుంచి అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సీఆర్ఎస్ విధానం అమల్లోకి వస్తే జనన, మరణాల సంఖ్య సెకన్లో అప్డేట్ అయి దేశ వ్యాప్త వివరాలను తెలుసుకునే వీలు ఉంటుంది. ప్రతి బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్లకు యూనిక్ ఐడీ ఉంటుంది. ఒకరు ఒకటి కంటే ఎక్కువ బర్త్ సర్టిఫికెట్లు పొందలేరు. ఆధార్‌తో అనుసంధానం చేసే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేషన్ జరుగుతుంది.