నగరంలో సెల్‌ఫోన్ స్నాచర్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు.. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న వారిపై పగలు, రాత్రి అని తేడా లేకుండా విరుచుకుపడుతున్నారు. ఫోన్ పోయిందంటూ పోలీస్స్టేషన్లకు వెళ్తే వెబ్సైట్లో నమోదు చేయండి.. దొరికినప్పుడు మీకు వస్తుందంటూ పోలీసులు చేతులు దులుపుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మరో పక్క బస్సు ప్రయాణికులకు కూడా రక్షణ లేకుండా పోయింది. రాత్రి వేళల్లో మద్యం తాగిన వారు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న వారిపై దాడులు చేస్తున్నారు. రెండుసంవత్సరాలుగా స్నాచింగ్‌లు పెరుగుతూ వస్తున్నాయి. సెల్ఫోన్ల కోసం హత్యలు జరిగిన ఘటనలు ఉన్నాయి. పోలీసులు స్నాచర్లపై కాల్పులు జరిపి.. భయాన్ని నింపేందుకు విఫలయత్నం చేశారు. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నిత్యం 50కిపైగానే ఫోన్లు స్నాచింగ్‌లకు గురవుతున్నాయి.

Cell
సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో సెల్‌ఫోన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు.. ఒంటరిగా వెళ్తున్న వారిపై పగలు రాత్రి తేడా లేకుండా విరుచుకుపడుతున్నారు. బాధితుల్లో స్త్రీ, పురుషులనే తేడా లేదు. కానీ సెల్‌ఫోన్ పోయిందని పోలీస్స్టేసన్లకు వెళ్తే వెబ్సైట్లో నమోదు చేయండి… దొరికినప్పుడు మీకు వస్తుందని పోలీసులు అక్కడికక్కడే చేతులు దులుపుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు వేగంగా స్పందిస్తే దొంగలు దొరికే అవకాశాలున్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కల్గిస్తోంది.
మరో పక్క బస్సు ప్రయాణికులకు కూడా రక్షణ లేని పరిస్థితులు నెలకొంటున్నాయి. రాత్రి వేళల్లో మద్యం సేవించి ఒంటరిగా పాదచారులు నడుచుకుంటూ వెళ్తున్నారంటే అలాంటి వారిపై విరుచుకుపడుతున్నారు. అలాంటి బాధితులు కనీసం పోలీసులకు కూడా చెప్పుకోలేక.. గప్‌చుప్‌గా ఉంటున్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా హైదరాబాద్‌లో సెల్‌ఫోన్ స్నాచింగ్‌లు పెరుగుతూనే ఉన్నాయి. సెల్‌ఫోన్ స్నాచర్లు.. సెల్ఫోన్ల కోసం హత్యలు సైతం చేసిన ఘటనలు హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో స్నాచర్లపై పోలీసులు కాల్పులు జరిపి.. స్నాచర్లలో భయాన్ని నింపేందుకు విఫలయత్నం చేశారు. అయితే ఇదంతా కొన్ని రోజులకే పరిమితమైంది. తిరిగి ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ప్రతి నిత్యం 50కిపైగానే సెల్ఫోన్లు స్నాచింగ్‌లకు గురవుతున్నాయి.
పోలీసులు అప్రమత్తంగా ఉంటే…!
సెల్‌ఫోన్ స్నాచింగ్….. సెల్‌ఫోన్ మిస్సింగ్ అనేవి రెండు వేరు వేరు అంశాలు. సెల్‌ఫోన్ స్నాచింగ్ అయ్యిందంటూ పోలీసులకు సమాచారం అందింతే వెంటనే స్పందించి దొంగల కోసం వేట మొదలు పెట్టాలి. కానీ పోలీసులు ఆ పనిచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సెల్‌ఫోన్ పోయిందంటే పోలీసులు తేలికగా తీసుకుంటున్నారు. ‘మీరు వెబ్సైట్లో ఫిర్యాదు చేయండి… ఐఎంఈఐ నెంబర్ ఆధారంగా సెల్‌ఫోన్ దొరికితే మీకు ఎప్పుడో ఓ సారి వస్తుంది’ అని చెప్పి పంపిస్తున్నారు.
ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఎటూ చూసినా సీసీ కెమెరాలున్నాయి. స్నాచర్లను పట్టుకోవడం కోసం పోలీసులు వెంటనే రంగంలోకి దిగితే ఎక్కడికక్కడే స్నాచర్ల ఆట కట్టించే అవకాశముంది. కానీ పోలీసులు మాత్రం అది నేరం కాదు అన్నట్లుగా వ్యవహరించడం ఆందోళన కల్గిస్తోంది. మనిషి ప్రాణం పోతేనే పోలీసులు స్పందించేలా ఉన్నారని సామాన్య ప్రజలు ఆవేదన చెందుతున్నారు. దొంగలు దొరికే అవకాశమున్నా… ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతోనే సెల్‌ఫోన్ స్నాచర్లు మాఫియాగా తయారయ్యారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్న సెల్ఫోన్లు దేశ సరిహద్దులు దాటి ఇతర దేశాలకు కూడా వెళ్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పోలీసు బాస్‌లు సెల్‌ఫోన్ స్నాచింగ్‌ను తీవ్ర నేరంగా పరిగణించి కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.
కొన్ని ఘటనలు