బంజారాహిల్స్, జూలై 6 : రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తి వద్ద నుంచి సెల్‌ఫోన్ లాక్కుని పారిపోయిన ముఠాలోని ఓ సభ్యుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాకు చెందిన అరవింద్‌కుమార్ అనే ప్రైవేటు ఉద్యోగి ఫిలింనగర్లో నివాసం ఉంటాడు. శనివారం తెల్లవారుజామున డ్యూటీ ముగించుకుని మరో నలుగురు వ్యక్తులతో కలిసి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద ఆటో దిగాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ ఫిలింనగర్ వైపు వెళ్తున్నాడు.
కాగా జర్నలిస్ట్ కాలనీ సమీపంలోకి రాగానే వెనకనుంచి బైక్‌మీద వచ్చిన ముగ్గురు యువకులు అరవింద్‌కుమార్‌ను అటకాయించారు. తన సెల్‌ఫోన్ కాజేశావంటూ గొడవకు దిగారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్దామంటూ అతడిని బలవంతంగా బైక్మీదకు ఎక్కించుకున్నారు. కొంతదూరం వెళ్లాక అతడి వద్ద నుంచి సెల్‌ఫోన్ లాక్కుని పారిపోయారు. అక్కడినుంచి మాదాపూర్‌కు వెళ్లిన దుండగులు మరో యువకుడిని ఇదే విధంగా బెదిరిస్తున్న క్రమంలో అక్కడ పెట్రోలింగ్ పోలీసులు ముఠాలోని నగేష్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. అతడిని విచారించగా బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోని స్నాచింగ్ విషయం బయటపడింది. ఈ మేరకు నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు.