CC Cameras | సిటీబ్యూరో, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ): శాంతి భద్రతల పరిరక్షణలో సీసీటీవి కెమెరాల పాత్ర చాలా కీలకం. ఒక్క సీసీటీవి వందమంది పోలీసులతో సమానం. హైదరాబాద్‌లో అంతటి కీలమైన నిఘా కళ్లకు నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. సరైన పర్యవేక్షణ లేక, నిర్వహణ లోపంతో వేలాది కెమెరాలు పనిచేయని పరిస్థితి వచ్చింది.నగర శాంతిభద్రతలకు ఎనలేని ప్రాధాన్యతనిస్తూ కేసీఆర్ సర్కారు హైదరాబాద్ మహానగరంలో దాదాపు 9 లక్షల వరకు సీసీ కెమరాలను ఏర్పాటు చేయిస్తే.. ప్రస్తుతం వాటిలో సగం కూడా పనిచేయడం లేదు. దీంతో ప్రధాన కూడళ్లలో, కీలకమైన మలుపుల్లో నేర ఘటనలు జరిగినప్పుడు తగిన సాక్ష్యాధారాలే లభించడం లేదు.
పారిశ్రామికంగా హైదరాబాద్ నగరం అగ్రభాగాన ఉండాలంటే అందుకోసం శాంతిభద్రతలు పటిష్టంగా ఉండాలన్ని ఉద్దేశంతో గత పదేళ్లలో కేసీఆర్ సర్కారు పోలీసు వ్యవస్థలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. అందులో భాగంగానే 2021 నాటికి దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించగలిగింది. దాదాపు 9 లక్షలకు పైగా సీసీ కెమెరాలు పనిచేస్తుండేవి.
2022లో ప్రపంచంలోనే సీసీ కెమెరాలు అధికంగా ఉన్న రెండో అతిపెద్ద నగరంగా పేరొందింది. హైదరాబాద్ నగరంలో ని 3 కమిషనరేట్లలో ప్రతీ వెయ్యిమంది ప్రజలకు 30 సీసీ కెమెరాలు ఉండేలా ఏర్పాటు చేయడంతో పాటు చదరపు కిలోమీటర్‌కు 480 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి లండన్, బీజింగ్, న్యూయార్క్ నగరాలను అధిగమించిన సిటీగా ప్రపంచంలోనే భాగ్యనగరం రెండోస్థానాన్ని సంపాదించుకుంది. ఇదంతా గతంలో సాధించిన కీర్తి. ఇప్పుడా పరిస్థితి నుంచి నగరం దిగజారింది.
ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 7 జోన్లలో మొత్తం 71 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. సిబ్బంది కొరతతో శాంతిభద్రతలు, ట్రాఫిక్, నేర పరిశోధనకు సాంకేతిక పరిజ్ఞానంపైనే పోలీసులు ఆధారపడుతున్నారు. గతంలో కార్పొరేట్ సామాజికబాధ్యత, సేఫ్‌సిటీ ప్రాజెక్ట్ వంటి వాటితో సిసి కెమెరాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. దీంతో సిటీలో అపార్ట్మెంట్లు, దుకాణదారులు, వ్యాపారులు, వివిధ కాలనీ సంక్షేమ సంఘాలు, కొందరు వ్యక్తిగతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని స్టేషన్ల పరిధిలో అధికారికంగా 1.79లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయి. ప్రస్తుతం మహానగరంలో చాలా చోట్ల సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. హైదరాబాద్‌లో ప్రధాన సర్కిళ్లతో పాటు చాలా ప్రాంతాల్లో దాదాపు 40శాతం కెమెరాలు పనిచేయడం లేదని అధికారులే స్వయంగా చెబుతున్నారు. ఉన్న కెమెరాలు పనిచేయక. పనిచేసే కెమెరాల నిర్వహణ సరిగా లేక.. కేసుల ఛేదనలో పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.